వరుస సమ్మెలతో అట్టుడికిపోతున్న బ్రిటన్‌

Demonstrators holding placards during a strike by NHS nursing staff outside St. Thomas' Hospital in London, UK, on Thursday, Dec. 15, 2022. Unprecedented walkouts by as many as 100,000 nursing staff on Dec. 15 and Dec. 20 will go ahead after ministers on Sunday rejected a union offer to suspend industrial action in return for talks over pay. Photographer: Hollie Adams/Bloomberg

వరుస సమ్మెలతో బ్రిటన్‌ అట్టుడికిపోతోంది. పలు రంగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు జరుపుతున్న వరుస సమ్మెలు, ఆందోళనలతో క్రిస్మస్‌ సీజను వేళ పండగ ఉత్సాహం కరువవుతోంది. ప్రధాన రైల్వే యూనియన్‌ ఆర్‌ఎంటికి చెందిన 40వేలమందికి పైగా సభ్యులు ఇప్పటికే సమ్మెలో వున్నారు. 
 
తాజాగా శుక్ర, శనివారాల్లో కూడా వీరి సమ్మె కొనసాగింది. పోస్టల్‌, నర్సులు, రవాణా కార్మికులు, అంబులెన్సు డ్రైవర్లు ఇలా అనేక రంగాలకు చెందిన వారు సమ్మెకు దిగడంతో మొత్తంగా దేశవ్యాప్తంగా జన జీవనం స్తంభిస్తోంది. ద్రవ్యోల్బణం పెచ్చరిల్లుతున్న వేళ తమకు వేతనాలు పెంచాలన్నది వారి ప్రధాన డిమాండ్‌గా వుంది.
 
 మరో మూడు వారాల పాటు అంటే వచ్చే ఏడాది జనవరి 8వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని బ్రిటన్‌ నేషనల్‌ రైల్వే ఇప్పటికే ప్రకటించింది. క్రిస్మస్‌ రోజున కూడా వదిలిపెట్టకుండా వరుసగా పండుగ మూడు రోజులు సమ్మె జరపాలని రైల్వే యూనియన్‌ నిర్ణయించింది. రవాణా రంగంలో తీవ్ర అంతరాయాలు వుంటాయని తెలిపింది. 
 
20 శాతం సర్వీసులు కూడా తిరగకపోవచ్చని పేర్కొంది. ఈ నెల 23, 24 తేదీల్లో క్రిస్మస్‌ డెలివరీలు ఎక్కువగా వుండే రద్దీ వేళల్లో తాము సమ్మె జరపనున్నట్లు కమ్యూనికేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిడబ్ల్యుయు) ప్రకటించింది. 
 
డిసెంబరు చివరి రోజుల్లో సివిల్‌ సర్వీస్‌ ఇండిస్ట్రియల్‌ యాక్షన్‌ వుంటుందని పబ్లిక్‌, కమర్షియల్‌ సర్వీస్‌ (పిసిఎస్‌) యూనియన్‌ ప్రకటించింది. పండుగ వేళ బ్రిటన్‌లోకి ప్రవేశించాలనుకునే వారికి ఈ ప్రతిపాదిత సమ్మెతో ఇబ్బందులు తప్పవు. సరిహద్దుల వద్ద వేచి వుండక తప్పదు.
 
 కాగా, ఇప్పటికే లక్ష మందికి పైగా నర్సులు సమ్మె బాట పట్టారు. బ్రిటన్‌ గతంలో ఎనుడూ చూడని రీతిలో పారిశ్రామిక నిరసన కార్యాచరణ వ్యక్తమవుతోంది. 
 
కరోనా సమయంలో రాత్రి పగలు అని చూడకుండా శ్రమపడిన తమకు ఆనాడు నైతిక స్థైర్యం పెరిగిందని, కానీ ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తమకు చాలా అవమానకరంగా వుందని నర్సులు పేర్కొంటున్నారు. సమ్మెలను మించిన పర్యవసానాలు కూడా వుంటాయని ప్రభుత్వం గుర్తించాలని వారంటున్నారు.