అణు యుద్ధంకు వెనుకాడమని పాక్ మంత్రి ప్రగల్భాలు

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావ‌ల్ భుట్టో జ‌ర్ధారి చేసిన వివాదాస్పద వ్యాఖ్య‌లు ఒక వంక, క‌ల‌క‌లం రేపుతుండ‌గా ఆ దేశానికి చెందిన మరో మంత్రి, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత ష‌జియా మారి అణు యుద్ధానికి సిద్ధ‌మ‌ని భార‌త్‌ను హెచ్చ‌రించారు. పాకిస్తాన్‌కు ఎలా జ‌వాబివ్వాలో తెలుస‌ని, పాకిస్తాన్ వ‌ద్ద అణు బాంబు ఉంద‌నే విష‌యం భార‌త్ విస్మ‌రించ‌రాద‌ని అంటూ ఆమె ప్రగల్భాలు పలికారు.

అంతేకాక ఆమె బిలావల్ భుట్టోకు వత్తాసు పలుకుతూ ‘పాకిస్థాన్ ఓ అణ్వస్త దేశం అన్నది భారత్ మరచిపోకూడదు’అని హెచ్చరించినట్లు ఓ వార్తా సంస్థ(బోల్ న్యూస్) పేర్కొంది. అవసరమైతే భారత్‌పై అణ్వస్త్రాన్ని ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని షాజియా మర్రీ హెచ్చరించినట్లు తెలుస్తోంది.

ఆమె తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ఆదివారం ఓ ట్వీట్ కూడా చేశారు. పైగా పాకిస్థాన్ ఓ బాధ్యతాయుతమైన దేశం అని పేర్కొనడం గమనార్హం.  ‘మా అణ్వస్త్ర హోదా మౌనంగా ఉండేందుకు ఉద్దేశించింది కాదు. అవసరమైతే ప్రయోగించడానికి వెనుకాడబోము’ అని భారత్‌ను బెదింరించే ప్రయత్నం చేశారు. ఆమె ఇంకా “మీరు పాకిస్థాన్‌పై పదేపదే ఆరోపణలు చేస్తూ ఉంటే పాకిస్థాన్ చూస్తూ ఊరుకోదు” అని పేర్కొన్నారు.

అణ్వాయుధాలున్న తాము మౌనంగా కూర్చోబోమని, అవ‌స‌రమైన స‌మ‌యంలో తాము వెనుక‌డుగు వేయ‌మ‌ని పీపీపీ నేత హెచ్చ‌రించారు. త‌మ‌ను దెబ్బ‌తీస్తే చేతులు ముడుచుకుని కూర్చోబోమ‌ని, పాకిస్తాన్ దీటుగా స్పందిస్తుంద‌ని ఆమె పేర్కొన్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ భార‌త్‌లో విద్వేషం విర‌జిమ్ముతున్నార‌ని, మోదీ హ‌యాంలో హిందుత్వ‌ను ప్రేరేపిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఉగ్ర‌వాదంతో ముస్లింల‌కు బార‌త్ ముడిపెడుతోంద‌ని ఆరోపించారు.