ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ కు ఇరాన్ లో ప్రముఖ నటి అరెస్ట్

ఇరాన్‌లో ఆందోళనకారులపై అణచివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలకు సంఘీభావం ప్రకటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేసిన ప్రముఖ నటిని ఇరాన్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. ప్రముఖ నటి తరనేహ్  అలిదూస్తీని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని స్థానిక మీడియా తెలిపింది. 

అలిదూస్తీ నటించిన చిత్రం ‘ది సేల్స్‌మ్యాన్‌’ ఆస్కార్‌కు ఎంపికైంది. ఆందోళనలో పాల్గొన్న  ఓ వ్యక్తిని శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ ఇరాన్‌ ప్రభుత్వం అతనిని ఉరితీసింది. అతనికి సంఘీభావం తెలుపుతూ అల్‌దూస్తీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

 ”అతని పేరు మొహసేన్‌ షెకారి. ఈ రక్తపాతాన్ని చూస్తూ చర్యలు తీసుకోకుండా నిస్సహాయంగా చూస్తున్న ప్రతి అంతర్జాతీయ సంస్థలు చర్యలు తీసుకోకపోవడం మానవత్వానికి అవమానకరం ” అని పోస్ట్‌ చేశారు. ఆదివారం నాటికి అలిదూస్తి ఖాతా సస్పెండ్‌ చేశారు. 

ఆమె వాదనలకు అనుగుణంగా ఎటువంటి పత్రాలను అందించకపోవడంతో ఆమెను అరెస్ట్‌ చేసినట్లు ఇరాన్‌ ప్రభుత్వం తెలిపింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, విప్లవాత్మక వర్గాలకు మద్దతు ఇచ్చినందుకు నిర్బంధించినట్లు ప్రభుత్వం నివేదించింది. 

ఆందోళనల సమయంలో భద్రతా దళాలపై దాడి చేశాడంటూ అభియోగాలు మోపిన ఇరాన్‌ కోర్టు షెకారిని డిసెంబర్‌ 9న ఉరితీసింది. గత సెప్టెంబర్‌లో హిజాబ్‌ సరిగా ధరించలేదంటూ మాహ్సా అమ్ని అనే యువతిని మోరాలిటీ పోలీసులు అరెస్ట్‌ చేయగా.. పోలీస్‌ కస్టడీలో ఆమె మరణించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.