బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య కలకలం

నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మూడు, నాలుగు రోజుల క్రితమే ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా మంచల్‌ మండలం రంగాపూర్‌ గ్రామానికి చెందిన భానుప్రసాద్‌(18) ఆర్జీయూకేటీలో పీయూసీ-2 చదువుతున్నాడు. 
 
కాలేజీ క్యాంప్‌సలో నిరుపయోగంగా ఉన్న హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గది నుంచి దుర్వాసన రావడంతో విద్యార్థులు ఆదివారం యూనివర్సిటీ అధికారులకు సమాచారమందించారు. అధికారులు వచ్చి చూడడంతో భానుప్రసాద్‌ ఆత్మహత్య ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
కాగా అతడు మూడు, నాలుగు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి భానుప్రసాద్‌ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. 
 
భానుప్రసాద్‌ ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం ఆదివారం మధ్యాహ్నమే తెలిసినా అధికారులు గోప్యంగా ఉంచడం గమనార్హం. జరిగిన సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గదిలో నుంచి దుర్వాసన వచ్చే వరకు సిబ్బంది మృతదేహాన్ని గుర్తించకపోవడంపై కుటుంబ సభ్యులు, బంధువులు మండిపడుతున్నారు.
మరోవైపు భాను ప్రసాద్ ఉరి వేసుకున్న గదిలో సూసైడ్ లెటర్ లభ్యమైంది. తన చావుకు ఎవరూ బాధ్యులుకారని, మానసిక సమస్యే తన నిర్ణయానికి కారణమని అందులో రాశాడు. “నా చావుకు నేనే కారణం. గత ఏడాదిగా మానసిక క్షోభను అనుభవిస్తున్న. నా మానసిక సమస్యే నా చావుకు కారణం, ఏడాది నుండి మానసికంగా నరకయాతన పడుతున్న. అమ్మ అక్కని బాగా చూసుకో, నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చెయ్యి” అని అందులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పైగా,  “పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో చదువుపై ఆసక్తి పోయింది.  ఎన్నో సార్లు చనిపోవాలని అనుకున్న. నన్ను క్షమించు అమ్మ… అంటూ” రాసినట్టు పోలీసులు తెలిపారు. భాను ప్రసాద్ సూసైడ్ లెటర్ లో చెప్పిన వ్యాఖ్యలపై అతని కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తమ కుమారుడు చదవలేక ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అంటున్నారు.  మూడునాల్రోజుల క్రితమే భాను ఆత్మహత్య చేసుకున్నా క్యాంపస్ అధికారులు ఎవరూ చెప్పలేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇతరుల ద్వారా తమకు అర్ధరాత్రి తెలిసిందని, క్యాంపస్ లో విద్యార్థి చనిపోయినా కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వరా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మృతదేహం చూస్తే చాలా రోజుల క్రితమే మరణించినట్లు అనిపిస్తోందని, ఉస్మానియా డాక్టర్లతో పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
 
ఎబివిపి ఆందోళన 
కాగా, నిర్మల్ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ట్రిపుల్ ఐటీ విద్యార్థి భాను ప్రసాద్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ, ఏబీవీపీ నేతలు ఆస్పత్రిలోకి చొచ్చుకెళ్లారు. ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో జిల్లా ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోలీసులు బీజేపీ, ఏబీవీపీ నేతలను అరెస్టు చేశారు. మార్చురీలో ఉన్న భానుప్రసాద్ మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి మృతిపట్ల ప్రజాప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడు, నాలుగు రోజులుగా విద్యార్థి కనిపించకుంటే.. సిబ్బంది ఏం చేస్తున్నారని కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు.