రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ల తిరుగుబాటు 

ఏఐసీసీ నియమించిన తెలంగాణ పార్టీ కమిటీలతో చెలరేగిన సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తుంది. పార్టీ సీనియర్లు ఏకంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై నేరుగా దాడి ప్రారంభించారు. పార్టీలో వలస వచ్చిన వాళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరంతా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు ప్రకటించారు. పార్టీ అధిష్ఠానం వద్దకు వెళ్లి నాయకత్వ మార్పుకు పట్టుబట్టాలని నిర్ణయించారు. 
 
సీనియర్లపై కోవర్టులనే ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసలైన ఒరిజినల్ తామే అని స్పష్టం చేశారు. అసలు కాంగ్రెస్ నాయకులం తామే అని పేర్కొంటూ, ఇందుకోసం ఢిల్లీ వెళ్లి హైకమాండ్ తో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహా ప్రకటించారు. 
 
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో సమావేశమై పార్టీని కాపాడేందుకు `సేవ్ కాంగ్రెస్’ నినాదంతో ముందుకు సాగుదామని నిర్ణయించారు. కమిటీల్లోని 108 మందిలో 58 మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తి పార్టీని ఉద్దరిస్తాడా..? అని ప్రశ్నించారు. 
 
కాంగ్రెస్ పార్టీని వేరే వాళ్లకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. పార్టీని నమ్ముకొని పని చేసిన వారికి కమిటీల్లో అవకాశం రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే కుట్ర జరుగుతోందని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ హెచ్చరించారు.
 
 క్యారెక్టర్ లేనివాళ్లు పార్టీని నడిపిస్తున్నారని పేరొక్నటు తమను ప్రశ్నించే స్థాయి వారికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస వచ్చినోళ్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ రోజు పంచాయితీ వచ్చిందని చెబుతూ ఇదంతా పార్టీని నాశనం చేసే ప్రయత్నమేనని ఆరోపించారు. సోషల్ మీడియాలో తమపై  తప్పుడు ప్రచారాలు జరుగుతున్నా వలస నాయకుడు కనీసం ఖండించడం లేదని  ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు.