రేపే నౌకాద‌ళంలోకి మ‌ర్ముగోవా యుద్ధ నౌక‌

భారత నేవీ అమ్ములపొదిలో మరో అస్త్రం చేరనుంది. ప్రాజెక్టు-15బి కింద దేశీయంగా తయారు చేసిన విశాఖపట్నం తరగతి క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్ఎస్ మర్ముగోవా ఆదివారం ముంబైలోని నావల్‌ డాక్‌యార్డ్‌ నుంచి జలప్రవేశం చేయనుంది. ప్రాజెక్టు-15బి కింద దేశీయంగా నాలుగు విశాఖపట్నం తరగతి యుద్ధనౌకలను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఒక యుద్ధనౌక నిర్మాణం పూర్తి చేసుకుని విధుల్లో చేరింది. రేపు విశాఖపట్నం తరగతికి చెందిన రెండో యుద్ధనౌక కూడా జలప్రవేశం చేయబోతుంది.  మరో రెండు విశాఖపట్నం తరగతి యుద్ధనౌకలు నిర్మాణంలో ఉన్నాయి. ఇది పీ15 బ్రేవ‌ర్ క్లాసుకు చెందిన‌ది. ఈ నౌక‌లో అన్ని ర‌కాల ఆయుధాలు, సెన్సార్లు ఉన్నాయి. ఎటువంటి స‌మ‌యంలోనైనా దీన్ని ఆప‌రేట్ చేయ‌వ‌చ్చు అని క‌మాండ‌ర్ అన్షుల్ శ‌ర్మ తెలిపారు.

యాంటీ ఎయిర్‌, యాంటీ స‌బ్‌మెరైన్ ఆయుధాలు ఈ షిప్‌లో ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. మిస్సైల్ వ్య‌వ‌స్థ కూడా ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. హిందూ మ‌హాస‌ముద్రంలో ర‌క్ష‌ణ‌, నౌకాద‌ళ స‌త్తాను పెంచ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. గోవా విముక్తి దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఈ నౌకను జలప్రవేశం కావింపనున్నారు. 

ఐఎన్ఎస్ మ‌ర్ముగోవా సెకండ్ జ‌న‌రేష‌న్‌కు చెందిన స్టీల్త్ గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయ‌ర్‌. ప్రాజెక్టు 15బీ కింద దీన్ని త‌యారు చేశారు. ప్రాజెక్టు 15బీ కింద మొత్తం నాలుగు నౌక‌ల కోసం 2011లో కాంట్రాక్టు జ‌రిగింది. అయితే గ‌త ఏడాది ఐఎన్ఎస్ విశాఖ‌ప‌ట్ట‌ణంను జ‌ల‌ప్ర‌వేశం చేశారు.  గోవాలోని మర్ముగోవా సిటీ పేరును దీనికి పెట్టారు.

మ‌ర్ముగోవా నౌక 163 మీట‌ర్ల పొడుగు, 17 మీట‌ర్ల వెడ‌ల్పు ఉంటుంది. ఇది సుమారు 7400 ట‌న్నుల బ‌రువు ఉంటుంది. దీని అత్య‌ధిక వేగం 30 నాట్స్ అని ఇండియ‌న్ నేవీ ఓ ప్ర‌క‌న‌ట‌లో తెలిపింది.  భార‌త నౌకాద‌ళానికి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో దీన్ని డిజైన్ చేసింది. మ‌జగాన్ డాక్ షిప్‌బిల్డ‌ర్స్ దీన్ని నిర్మించారు. విశాఖ‌ప‌ట్ట‌ణం, మర్మ‌గోవా, ఇంపాల్‌, సూర‌త్ న‌గ‌రాల పేరు మీద నాలుగు విధ్వంస‌క యుద్ధ నౌక‌ల‌ను త‌యారు చేస్తున్న విష‌యం తెలిసిందే.