పాక్ మంత్రి ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పాలని బీజేపీ నిరసనలు

 
దేశవ్యాప్తంగా బీజేపీ నేతల ఆందోళనలు మిన్నంటాయి. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ నిరసనలు చేపట్టింది. బీజేపీ కార్యకర్తలు పాక్‌ విదేశాంగ మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలుపుతున్నారు. 
 
ఢిల్లీ, ముంబై సహా అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తల నిరసనలు కొనసాగుతున్నాయి. ‘గుజరాత్ కసాయి’ అంటూ బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరమని.. దీనికి పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బీజేపీ నేతలు హెచ్చరించారు. 
 
ఈ మేరకు బీజేపీ కార్యకర్తలు ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం దగ్గర పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి.. పాకిస్తాన్ డౌన్ డౌన్, బిలావల్ భుట్టో జర్దారీ క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేశారు.
 
బీజేపీ నిరసనల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాక్ రాయబార కార్యాలయం వైపు ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బారికేడ్లను ఏర్పాటు చేయగా వాటిని ఛేదించుకుని ఎంబసీ వైపు బీజేపీ కార్యకర్తలు పరుగులు తీశారు. నిరసనలు ఉద్రిక్తంగా మారడంతో.. పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
 
హైదరాబాద్ లో నిరసన 
 
హైదరాబాద్ లో బషీర్ బాగ్ లోని బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న బీఆర్ అంబేడ్కర్‌ విగ్రహం వరకు బీజేపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ తో పాటు పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు, పాకిస్తాన్ కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.  కాగా, ప్రధాని మోదీపై పాకిస్తాన్ చేసి‌న వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలపై స్పందించకుంటే సీఎం కేసీఆర్ పాకిస్తాన్‌కు సహరిస్తున్నట్లే అని స్పష్టం చేశారు. ఎంఐఎంను బాధ పెట్టడం ఇష్టంలేకనే సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారని విమర్శించారు.