ఎంఎల్ఏ రోహిత్‌ రెడ్డి, నటి రకుల్ లకు ఈడీ నోటీసులు

ఎంఎల్ఏ రోహిత్‌ రెడ్డి, నటి రకుల్ లకు ఈడీ నోటీసులు

భారత్ రాష్ట్ర సమితి  ఎంఎల్ఏ పైలట్‌ రోహిత్‌రెడ్డికి ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్  నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్‌ రకుల్ ప్రీత్‌సింగ్‌కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో వీళ్లిద్దరికీ నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.

ఈనెల 19న విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈడీ నోటీసులపై ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి స్పందిస్తూ  ఈడీ నోటీసులు అందాయని తెలిపారు. తన వ్యాపారాలు, కంపెనీలకు సంబంధించిన వివరాలు అడిగారని చెప్పారు. 19న ఈడీ విచారణకు హాజరవుతానని చెప్పారు.

2021 ఫిబ్రవరిలో బెంగళూరులోని గోవర్థనపుర పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు నోటీసులిచ్చారు. కలహర్‌రెడ్డి అనే వ్యాపారితో కలిసి రోహిత్‌రెడ్డి పార్టీకి వెళ్లారని, అలాగే సినీ నిర్మాత శంకర్‌గౌడ ఇచ్చిన పార్టీలో కూడా ఆయన పాల్గొన్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. నైజీరియన్ల నుంచి రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పార్టీకి చేరినట్లు పోలీసులు తేల్చారు.

డ్రగ్స్ తీసుకున్న మస్తాన్, శంకర్‌గౌడను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు ఈ కేసులో హీరో తనీష్‌ ను కూడా బెంగళూరు పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలోనే రోహిత్ రెడ్డికి నోటీసులు అందినట్లు తెలుస్తోంది.

గతంలో రకుల్ ఒకసారి ఈడీ విచారణకు హాజరైంది. అత్యవసరంగా వెళ్లాల్సి ఉందని గతంలో విచారణ మధ్యలోనే వెళ్లిపోయింది రకుల్. దీంతో మరోసారి విచారణకు హాజరు కావాలని రకుల్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. గతేడాది సెప్టెంబర్ 3తేదీన రకుల్ ప్రీత్ ను ఈడీ అధికారులు విచారించారు. అయితే తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది.

గతేడాది ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఈడీ పలువురిని ప్రశ్నించింది. ఎక్సైజ్ అధికారులు 2017 జులైలో ఎన్డీపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. సిట్ ఏర్పాటు చేసి పలువురు నటులు, దర్శకుడిని అధికారులు ప్రశ్నించారు.

2021 సెప్టెంబర్ లో మనీలాండరింగ్ కింద టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఈడీ దర్యాప్తు చేసి 12 మందికి నోటీసులు జారీ చేసింది. పూరి జగన్నాథ్, ఛార్మి, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుపాటి రానా, ముమైత్ ఖాన్, నందు, తనీష్, తరుణ్, నవనీత్, పబ్ మేనేజర్, రవితేజ డ్రైవర్ శ్రీనివాసులను ఈడీ విచారించింది.