ఏపీలో గాలి నాణ్యతను పెంచేందుకు మరో 11 నగరాలు 

నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద గాలి నాణ్యతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఎంపికైన విజయవాడ, విశాఖపట్నంలతో పాటు అదనంగా మరో 11 పట్టణాలను ఎంపిక చేసినట్లు పర్యవరణ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే ప్రకటించారు. 
 
రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఎంపిక చేసిన పట్టణాల్లో శ్రీకాకుళం, చిత్తూరు, ఒంగోలు, విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, అనంతపురం, కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు ఉన్నట్లు చెప్పారు.


జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం కింద ఈ పట్టణాల్లో గాలి నాణ్యత పెంచేందుకు చర్యలు చేపట్టనున్నట్లు అశ్వినీ కుమార్ చౌబే తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ నగరాలలో గాలి నాణ్యతను మెరుగు పరిచేందుకు పనితీరు ఆధారిత గ్రాంట్‌ను ఇస్తూ 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది.
 
 ఈ గ్రాంట్‌ కింద విజయవాడకు 2022-23లో రూ. 163 కోట్లు కేటాయించగా, 2021-22లో రూ. 100.35 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రమంత్రి చౌబే పేర్కొన్నారు. అలాగే 2022-23 సంవత్సరం వరకు విశాఖ నగరానికి రూ. 148 కోట్లు కేటాయించగా, 2021-22 వరకు రూ. 100.75 కోట్లు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు.
 
దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం స్ధాయి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో నగరాల్లో గాలి నాణ్యతను పెంచేందుకు కేంద్రం క్లీన్ ఎయిర్ పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన నగరాల్లో గాలి నాణ్యత పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టబోతోంది.