సీబీఐ అధికారులపై బెంగాల్ లో హత్య కేసు 

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు చెందిన ఏడుగురు అధికారులపై పశ్చిమబెంగాల్‌ సీఐడీ హత్యానేరం కింద  కేసులు నమోదు చేసింది. బీర్‌భూమ్‌ జిల్లా బొగ్టుయ్‌లో జరిగిన హింస కేసులో ప్రధాన నిందితుడు లాలాన్‌ షేక్‌ సీబీఐ అధికారుల కస్టడీలో మరణించాడు.  ఈ ఘటనలో సీబీఐ డీఐజీ, ఎస్పీ సహా ఏడుగురు అధికారులపై హత్య, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు బుధవారం సీఐడీ అధికారులు తెలిపారు. సోమవారం మృతి చెందితే, సిబిఐ అధికారులపై రెండు రోజుల తర్వాత కేసు నమోదు చేయడం గమనార్హం.
పారిపోయి,  గత మార్చ్ నుండి ఝార్ఖండ్ లో ఉంటున్న అతనిని డిసెంబర్ 4న సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతని మరణంలో సిబిఐ అధికారుల పాత్ర గురించి టిఎంసి నేత మదన్ మిత్ర మంగళవారం ఆరోపణ చేయడం, ఆ వెంటనే  మృతుడి  భార్య రేష్మా బీబీ సీబీఐ అధికారులపై ఫిర్యాదు చేయడం, మరుసటి రోజు కేసు నమోదు చేయడం జరిగింది.
కాగా,  కేసుతో సంబంధం లేని సీనియర్ల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు చేర్చారో తెలియడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. సీఐడీ కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని వారు స్పష్టం చేశారు. ఈ కేసు విచారణకు సిఐడి అధికారులకు అనుమతి ఇచ్చినా తుది తీర్పు వచ్చే వరకు సిబిఐ అధికారులపై ఎటువంటి చర్యకు పాల్పడవద్దని బుధవారం కలకత్తా హైకోర్టు ఆదేశించింది.
సాక్ష్యాలను, ప్రకటనలను, దర్యాప్తును వీడియో చిత్రీకరణ చేయమని చెబుతూ కోర్టు నిర్ధారించే వరకు తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వంకు సమర్పించవద్దని హైకోర్టు సింగల్ బెంచ్ న్యాయమూర్తి జయ్ సేన్ గుప్తా సిఐడికి స్పష్టం చేశారు. ఎఫ్ఐఆర్ లో మార్పులు చేసిన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తూ ఇతర ముఖ్యమైన కేసులు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులను, సంబంధం లేకపోయినా ఇందులో దోషులుగా పేర్కొనడం పట్ల హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సిబిఐ వర్గాలు పేర్కొంటున్నాయి.
సీనియర్ టిఎంసి నేత అనుబ్రత మండల్ కు సంబంధం ఉన్న పశువుల అక్రమ రవాణా కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులను ఈ కేసుతో సంబంధం లేకపోయినా నిందితులుగా పేర్కొనడాన్ని సీబీఐ హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చింది. పశువుల అక్రమ రవాణా కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులు సుశాంత భట్టాచార్య, స్వరూప్ దెయ్ లను ఈ కేసులో బెంగాల్ సిఐడి నిందితులుగా పేర్కొనడం గమనార్హం.
ఈ ఏడాది మార్చి 21న బొగ్టుయ్‌లో టీఎంసీ నేత బాడూ షేక్‌ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో అల్లర్లు జరిగాయి.  నాటి హింసలో 10 మంది మరణించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న లాలాన్‌ షేక్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. అయితే సీబీఐ అధికారులు విచారిస్తున్న కార్యాలయంలోని మరుగుదొడ్లో లాలాన్‌ సోమవారం ఉరి వేసుకొని మరణించాడు.
తన భర్తను తీసుకొని వెళ్లే సమయంలో చంపేస్తామని బెదిరించారని, తనను కూడా కొట్టారని రేష్మా ఆరోపించారు. సోమవారం మధ్యాహ్నం అధికారులు ఫోన్‌ చేసి లాలాన్‌ షేక్‌ మరణించినట్లు చెప్పారని, అదే సమయంలో తనను, తన కొడుకును చంపేస్తామని బెదిరించారని తెలిపారు. ఈ ఆరోపణలను సీబీఐ అధికారులు కొట్టిపారేశారు.
మరోవంక, లాలాన్‌ షేక్‌ మృతికి కారకులైన సీబీఐ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బుధవారం మృతదేహంతో బీర్భం జిల్లాలోని సీబీఐ కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన ప్రదర్శన చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు షేక్‌ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగానే మృతదేహంతో సీబీఐ ఆఫీసు వద్ద కు చేరుకొని, షేక్‌ మృతికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.