భారత్ చరిత్రను వక్రీకరించే పాక్ ఓటీటీ ఛానెల్‌పై నిషేధం

పాకిస్థాన్‌కు చెందిన ఒక‌ ఓటీటీ టీవీ ఛానెల్‌పై భార‌త్ నిషేధం విధించింది. భార‌త‌దేశానికి వ్య‌తిరేకంగా వెబ్‌సిరీస్‌ను రూపొందించార‌నే కార‌ణంతో విడ్లి టివి  ఓటీటీని సోమవారం బ్యాన్ చేసింది. కేంద్ర‌ స‌మాచార, ప్ర‌సార‌ శాఖ ఈ విష‌యాన్ని ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

ఆ వెబ్‌సైట్‌కు సంబంధించిన‌ రెండు మొబైల్ యాప్స్‌, నాలుగు సోష‌ల్‌మీడియా ఖాతాల‌ను ఐటీ చ‌ట్టం 2021 ప్ర‌కారం నిషేధించింది. విడ్లి సంస్థ తాజాగా “సేవ‌క్: ది క‌న్‌ఫెష‌న్”  అనే వెబ్ సిరీస్ రూపొందించింది. ఈ వెబ్ సిరీస్ భార‌త దేశ భ‌ద్ర‌త‌, స‌మ‌గ్ర‌త‌, సార్వ‌భౌమ‌ధికారానికి, విదేశాల‌తో భార‌త స్నేహ సంబంధాల‌కు హాని చేసే విధంగా ఉంద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

సేవ‌క్ వెబ్‌సిరీస్ ప్రారంభంలోనే భార‌త జాతీయ జెండాలోని అశోక చ‌క్రం మంట‌ల్లో త‌గ‌ల‌బ‌డుతున్న సీన్ వ‌స్తుంది. అంతేకాదు భార‌త‌దేశానికి సంబంధించిన సున్నితమైన అంశాలను ఇందులో వ‌క్రీక‌రించి చూపించారు. ఈ వెబ్‌సిరీస్‌లో భార‌తదేశాన్ని త‌ప్పుగా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా తెర‌కెక్కించారు.

భార‌త‌ప్ర‌భుత్వం స్వ‌ర్ణ దేవాల‌యంలో చేప‌ట్టిన‌ ఆప‌రేష‌న్ బ్లూస్లార్, ఆ త‌ర్వాతి సంఘ‌ట‌న‌లు, బాబ్రీ మ‌సీద్ కూల్చివేత‌, మాలేగావ్ పేలుళ్లతో పాటు సట్లెజ్, య‌మునా న‌ది మ‌ధ్య వివాదం గురంచి కూడా వెబ్‌సిరీస్‌లో త‌ప్పుగా చూపించార‌ని కేంద్ర స‌మాచార శాఖ పేర్కొంది.