ప్రయాణికుల ఫిర్యాదులతో ఢిల్లీ ఎయిర్ పోర్టుకు సింధియా

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎయిర్ పోర్టులో రద్దీపై ప్రయాణికుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఇవాళ ఉదయం విమానాశ్రయంలోని టెర్మినల్ 3ని సందర్శించారు. 
 
అక్కడ తాజాగా నెలకొన్న పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల సమస్యలపై విమానాశ్రయ సిబ్బందిని ఆరా తీశారు. అదేవిధంగా ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ఎయిర్‌పోర్టు విస్తరణ పనులను సైతం మంత్రి పరిశీలించారు.
 
 ప్రస్తుతం 6.6 కోట్ల వార్షిక ప్రయాణికుల సామర్థ్యం ఉన్న విమానాశ్రయాన్ని 10 కోట్లకు పెంచాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు. 73 శాతం ఈ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో పనుల పురోగతికి సంబంధించిన వివరాలను సైతం సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఢిల్లీ విమానాశ్రయంలో గత కొన్ని రోజులుగా తీవ్రమైన రద్దీ నెలకొంటుంది.  ప్రయాణికులు అన్ని రకాల చెకింగ్‌లు పూర్తి చేసుకొని విమానం ఎక్కేందుకు కొన్ని గంటల సమయం పడుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఈ విషయమై ప్రయాణికులు ఆదివారం తమ అవస్థలను సోషల్‌ మీడియా ద్వారా పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దృష్టికి తీసుకొచ్చారు. సాధారణ ప్రయాణికులే కాదు.. పలువురు ప్రముఖులు సైతం ఢిల్లీ విమానాశ్రయంలోని పరిస్థితులను వివరిస్తూ మంత్రికి ట్యాగ్‌ చేశారు.
 
తనిఖీ కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు ప్రయాణికులు పేర్కొన్నారు. విమానం బయలుదేరే వరకు కూడా తనిఖీలు పూర్తి అవడం లేదని..క్లియరెన్స్ ప్రాంతంలో రెండు, మూడు గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోందని ఫిర్యాదు చేశారు. 
ఈ మేరకు కిక్కిరిసిన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ ఫొటోలను సైతం పంచుకున్నారు. ముఖ్యంగా మూడో టెర్మినల్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తతుం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విస్తరణ పనులు జరుగుతుండటంతో ప్రయాణికులను టీ3 వైపు మళ్లించడం కూడా సమస్యకు కారణమవుతోంది. ప్రయాణికుల సమస్యలపై స్పందించిన మంత్రి విమానాశ్రయాన్ని సందర్శించారు.