హిమాచ‌ల్ లో గెలిచింది ఒకే మ‌హిళా ఎమ్మెల్యే

రక్షణ రంగంలో సహితం అన్ని రంగాలలో మహిళలో కీలకమైన స్థానాలకు ఎదుగుతూ ఉండగా రాజకీయాలలో మాత్రం వారికి చెప్పుకోదగిన ప్రాతినిధ్యం లభించడం లేదు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 68 స్థానాలకు గాను ఒకే ఒక్క మ‌హిళా ఎమ్మెల్యే విజ‌యం సాధించారు.
బీజేపీకి చెందిన రీనా క‌శ్య‌ప్ ఆ ఎన్నిక‌ల్లో గెలుపొందారు. నిజానికి ఆ రాష్ట్రంలో దాదాపు 49 శాతం మంది ఓట‌ర్లు మ‌హిళ‌లే ఉన్నారు. రీనా గెలిచినా, ఆమె పార్టీ మాత్రం తాజా ఎన్నిక‌ల్లో ఓట‌మి చ‌వి చూసింది.   ఈసారి ఎన్నిక‌ల్లో బీజేపీ ఆరు మంది మ‌హిళ‌ల‌కు స్థానాలు కేటాయించింది. కాంగ్రెస్ నుంచి అయిదుగురు, ఆమ్ ఆద్మీ నుంచి ముగ్గురు మ‌హిళ‌లు పోటీప‌డ్డారు. ఒక్క రీనా మాత్ర‌మే విజయం  సాధించింది.
ప‌చాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె గెలుపొందగారు. ఇదే స్థానం నుంచి ఆమె 2021లో జ‌రిగిన ఉప ఎన్నికలో కూడా ఆమె గెలిచారు. 2017 ఎన్నిక‌ల్లో హిమాచ‌ల్‌లో మొత్తం న‌లుగురు మ‌హిళా అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. బిజెపి మంత్రివర్గంలో ఏకైక మహిళా మంత్రి సర్వీన్ చౌదరి కూడా ఓటమి చెందారు. 42 నియోజకవర్గాలలో పురుష ఓటర్లకన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా ఓటు వేశారు. అయినా మహిళా అభ్యర్థుల గెలుపుకు సహకరింపలేక పోయారు. 

 కానీ ఈసారి ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారింది. రాష్ట్రంలో మ‌హిళా ఓట‌ర్లు 49 శాతం ఉన్నా.. కేవ‌లం ఒకే ఒక్క మ‌హిళ గెల‌వ‌డం అక్క‌డి ప‌రిస్థితిని ఎత్తి చూపుతుంది. మాజీ మంత్రి స‌ర్వీన్ చౌద‌రీ, ఆశా కుమారి, రీటా థీమ‌న్‌, చంపా థాకూర్‌లు ఈసారి ఎన్నిక‌ల్లో ఓట‌మిపాల‌య్యారు. 1998 నుంచి హిమాచ‌ల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హిళా ఓట‌ర్లే ఆధిక సంఖ్య‌లో పోలింగ్‌లో పాల్గొంటున్నారు.