కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బిఎస్ఎన్ఎల్ లో పెన్షన్లు 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బిఎస్ఎన్ఎల్,  ఎంటిఎన్ఎల్ ఉద్యోగులకు కూడా ఉద్యోగులకు పెన్షన్లు అందించాలని భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) ప్రతినిధి బృందం లేవనెత్తిన డిమాండ్‌కు కేంద్ర కమ్యూనికేషన్ల  మంత్రి  అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ఆ ప్రతిపాదనను ఆమోదిస్తూ, క్లియరెన్స్ కోసం తన మంత్రిత్వ శాఖ లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్‌కు పంపుతుందని ఆయన హామీ ఇచ్చారు. 
 
బిఎంఎస్ అఖిల భారత సంఘటనా కార్యదర్శి బి సురేంద్రన్, అఖిల భారత కార్యదర్శులు అశోక్ శుక్లా, గిరీష్ ఆర్యలతో పాటు దిలీప్ చక్రవర్తి, కాళీ కుమార్ (బిఆర్ఎంఎస్)లతో కూడిన ప్రతినిధివర్గం కేంద్ర మంత్రిని కలసి ఈ ప్రతిపాదన చేసింది.  
 
బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్, రైలేలు, ఇండియా పోస్ట్ పేమెంట్ అధికారులకు సంబంధించిన వివిధ సమస్యలను ఈ సందర్భంగా చర్చించారు. ఈ సమావేశంలో రైల్వే శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ దన్వే కూడా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్లు చెల్లించడంతో పాటు బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలను కూడా వారు చర్చించారు. తదుపరి పరిశీలనకు ఈ ప్రతిపాదనలను వెంటనే డిఓపిటికి పంపించారు.
కాగా,  ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో బిఎంఎస్ అనుబంధ అధికారుల సంఘం ఏకైక, అతిపెద్ద యూనియన్. ఈ కొత్త ప్రాంతంలో బీఎంఎస్‌ అభివృద్ధి చెందడాన్ని కొందరు అధికారులు జీర్ణించుకోలేక భిన్నమైన అణచివేత చర్యలకు పాల్పడ్డారని వారు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకు వచ్చారు.
 అందులో భాగంగానే కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ఏడుగురు ఆఫీస్‌ బేరర్‌లను అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ (ఇండో-చైనా సరిహద్దు), మణిపూర్‌లోని ఉఖ్రుల్‌ (ఇండో-మయన్మార్‌ సరిహద్దులు) వంటి సుదూర ప్రాంతాలకు పరిపాలన పేరుతో బదిలీ చేశారని తెలిపారు. బిఎంఎస్ ప్రతినిధి బృందం ప్రస్తావించిన ఈ ప్రతీకార చర్య సత్వర పరిష్కారానికి కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు.
ఐపిపిబి ఆఫీసర్స్ అసోసియేషన్‌లోని బిఎంఎస్ అనుబంధ యూనియన్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో క్రియాశీలంగా ఉన్న ఏకైక యూనియన్ అని పేర్కొంటూ,  వెంటనే దానికి గుర్తింపు ఇవ్వాలని వారు కోరారు.  కాగా, బిఆర్ఎంఎస్ కార్యకర్తలు బాధితులు, ఇతర కార్మికుల సమస్యలతో సహా రైల్వేలకు సంబంధించిన వివిధ సమస్యల గురించి కూడా వివరంగా చర్చించారు.
 సమావేశం చాలా స్నేహపూర్వకంగా, ఫలవంతంగా జరిగిందని పేర్కొంటూ సానుకూలంగా స్పందించిన ఇద్దరు మంత్రులకు సురేంద్రన్ కృతజ్ఞతలు తెలిపారు.