జైలు నుంచి రాగానే రామచంద్ర భారతి, నందకుమార్ అరెస్ట్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్  లను గురువారం చంచల్ గూడ జైల్ నుండి విడుదల కాగానే తిరిగి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.  బెయిల్ పొంది వారం రోజులైనా,  పూచీకత్తు, షూరిటీలు కోర్టుకు సమర్పించటంతో జాప్యం జరగడంతో బెయిల్ కాపీలు నేడే జైలుకు చేరుకున్నాయి.
 
దీంతో ఇద్దరు నిందితులను జైలు అధికారులు విడుదల చేశారు. కాగా.. వారు విడుదలైన మరుక్షణమే బంజారహిల్స్ పోలీసులు రామచంద్రభారతి, నంద కుమార్‌లను అరెస్టు చేశారు. జైలు నుంచి బయటకు రాగానే నంద కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను గత 45 రోజులుగా జైల్లోనే ఉన్నట్లు తెలిపారు. తనకు బయటం ఏం జరుగుతుందో తెలియదని చెప్పారు.
 
కేసు గురించి పూర్తిగా తెలుసుకున్నాక మాట్లాడతానని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడిన కాసేపటికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నందకుమార్ పై బంజారాహిల్స్ పీఎస్ లో నమోదైన చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. రామచంద్ర భారతిని ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్, ఫేక్ ఆధార్ కార్డ్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. రామచంద్ర భారతి, నందకుమార్ లను పోలీసులు బంజారాహిల్స్ పీఎస్ కి తీసుకెళ్లారు.
 
 ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే  సింహయాజీ జైలు నుంచి విడుదలయ్యారు. రామచంద్ర భారతి, సోమయాజీ, నందకుమార్ లకు  డిసెంబర్ 1న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.  షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు నిందితులు రూ.3 లక్షల చొప్పున పూచీకత్తుతో పాటు రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది.
 
నిందితులు ప్రతి సోమవారం సిట్ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.   నిందితులంతా పాస్ పోర్టులను సిట్ అధికారులకు అప్పగించడంతో పాటు సాక్ష్యులను ప్రభావితం చేసేలా వ్యవహరించవద్దని షరతు విధించింది.