కశ్మీర్‌ ఫైల్స్‌ వివాదంపై భారత్‌లో ఇజ్రాయెల్‌ రాయబారికి బెదిరింపు

‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇజ్రాయిల్ సినీ డైరెక్టర్ ఒకరి చేసిన వివాదాస్పద వాఖ్యలతో చెలరేగిన దుమారం ఇంకా కొనసాగుతుంది. ఈ  నేపథ్యంలో భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిల్లాన్‌కు బెదిరింపు వచ్చాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

దేశం విడిచి వెళ్లిపోవాలంటూ బెదిరింపులు వచ్చిన స్క్రీన్‌ షాట్‌ను ఆయన షేర్‌ చేశాడు. ‘తక్షణమే భారత్‌ను విడిచిపెట్టి వెళ్లండి, హిట్లర్‌ గొప్ప వ్యక్తి’ అని బెదిరింపు ట్విట్‌లో ఉన్నది. సందేశం పంపిన వ్యక్తి భద్రతను దృష్టిలో ఉంచుకుని అతడి గుర్తింపును దాచిపెడుతున్నట్లు నౌర్‌ గిల్లాన్‌ వెల్లడించారు. సదరు వ్యక్తి ప్రొఫైల్‌ ప్రకారం ఆయన పీహెచ్‌డీ చేస్తున్నాడని తెలిపారు.

కాగా, గిల్లాన్ మరో ట్వీట్‌లో భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తనకు భారతీయుల నుంచి చాలా మద్దతు లభిస్తున్నదని, ఇది తనకు  చాలా మంచి అనుభూతిని కలిగిస్తుందని చెప్పారు. ఆ సందేశాన్ని పంచుకోవడం వెనుక ఉద్దేశ్యం ఇవ్వాల్టికీ యూదు వ్యతిరేక భావాలు ప్రజల్లో ఉన్నాయని చెప్పడం మాత్రమే అని పేర్కొన్నారు.

మనమంతా కలిసి ఇలాంటి చర్యలను వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ద్వేష పూరిత సందేశాలు భారత్‌తో స్నేహంపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేశారు.  ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాపై ఇఫి జ్యూరీ హెడ్‌ నాదవ్‌ లాపిడ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో భారత్‌లో కలకలం రేగింది. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

వాతావరణాన్ని చల్లబరిచేందుకు భారత్ లో ఇజ్రాయెల్‌ రాయబారి నౌర్‌ గిల్లాన్‌ నదవ్‌ లెపిడ్ వ్యాఖ్యలను ఖండిస్తూ బహిరంగ క్షమాపణలు కోరారు. లాపిడ్‌ చేసిన ప్రకటన పట్ల సిగ్గుపడుతున్నట్లు వెల్లడించారు.