పాక్‌, చైనాలో మత స్వేచ్ఛకు ముప్పు

అమెరికా విడుదల చేసిన మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న 11 దేశాల జాబితాలో రష్యా కూడా ఉండటం విశేషం. రష్యాతోపాటు పాకిస్తాన్‌, చైనా కూడా ఉన్నాయి. ఈ దేశాలను ప్రత్యేక శ్రద్ధ కలిగిన దేశాల జాబితాలో చేర్చారు. మతపరమైన స్వేచ్ఛకు భంగం కలిగించడాన్ని సహించమని ఈ సందర్భంగా అమెరికా హెచ్చరించింది.
యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, చైనా, క్యూబా, ఎరిత్రియా, ఇరాన్, నికరాగ్వా, ఉత్తర కొరియా, పాకిస్తాన్, రష్యా, సౌదీ అరేబియా, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్‌లలో మత స్వేచ్ఛ లభించకపోవడం ఆందోళన కలిగించే అంశం. ఈ దేశాలు మతం ఆధారంగా వివక్షను, అణచివేతను ఆపలేకపోతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా మతం ఆధారంగా అణచివేతను అంతం చేయడానికి అమెరికా కృషి చేస్తూనే ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ చెప్పారు. ఫండమెంటలిస్ట్ అభిప్రాయాల వల్ల కలిగే హింసను ఆపడానికి యునైటెడ్ స్టేట్స్ సాధ్యమైనంత సాయం చేస్తామని తెలిపారు ‘ప్రపంచంలో ఎక్కడైనా ఏ వ్యక్తి అయినా తన మతం ప్రకారం జీవించే హక్కును పొందడంలో సహాయకారిగా ఉంటాం. అమెరికా దృష్టిలో కొన్ని ఇస్లామిక్ ఛాందసవాద సంస్థలు ఉన్నాయి. అలాంటి 10 సంస్థలు ఆందోళన కలిగించే జాబితాలో చేరాయి’ అని తెలిపారు.

వీటిలో అల్-షబాబ్, బోకో హరామ్, హయత్ తహ్రీర్ అల్-షామ్, హౌతీ, ఐసిస్‌-గ్రేటర్ సహారా, ఐసిస్‌-వెస్ట్ ఆఫ్రికా, జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమీన్, తాలిబాన్, వాగ్నర్ గ్రూప్ ఉన్నాయని ఆంథోని బ్లింకెన్‌ వెల్లడించారు.

ఇటువంటి దేశాలకన్నా మత స్వేచ్ఛను, ఇతర మానవ హక్కులను సమర్థవంతంగా పరిరక్షించే దేశాలు అమెరికాకు శాంతియుత, స్థిరమైన, సంపన్నమైన, మరింత విశ్వసనీయ భాగస్వాములుగా ఉంటాయని  బ్లింకెన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశంలో మత స్వేచ్ఛ లేదా విశ్వాసం స్థితిని అమెరికా జాగ్రత్తగా పర్యవేక్షిస్తుందని, మతపరమైన హింస లేదా వివక్షను ఎదుర్కొంటున్న వారి కోసం వాదిస్తుందని స్పష్టం చేశారు.

అంతర్జాతీయ ప్రమాణాలు, కట్టుబాట్లకు అనుగుణంగా లేని చట్టాలు, విధానాలను పరిష్కరించడానికి, ఈ జాబితాల నుండి తొలగించే మార్గంలో ఖచ్చితమైన దశలను వివరించడానికి అన్ని ప్రభుత్వాలతో సమావేశమయ్యే అవకాశాన్నిఅమెరికాస్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఇలా ఉండగా, అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఇటువంటి వార్షిక హోదాను ప్రకటించడానికి ముందు, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ వంటి కొన్ని బృందాలు ఆ జాబితాలో భారత్ ను కూడా చేరహాలని అమెరికాలో  భారీ లాబీయింగ్ ప్రయత్నాలు జరిపాయి.  అంతర్జాతీయ మత స్వేచ్ఛ విషయంలో భారత్‌ను ఆందోళనకరమైన దేశంగా పేర్కొనే విధంగా చేయడానికి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు తీసుకు వచ్చాయి.