ఒకే వ్యక్తికి ఒకే పదవి నుండి ఖర్గేకు మినహాయింపు 

కాంగ్రెస్ లో నీయమాలు వ్యక్తులను బట్టి ఉంటాయి. గాంధీ కుటుంభం ప్రయోజనాలను బట్టి ఉంటాయని మరోసారి రుజువవుతోంది. `ఒకే వ్యక్తి ఒకే పదవి’ నియమాన్ని తమకు ఇష్టం వచ్చిన్నట్లు మార్చుకొంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లిఖార్జున్ ఖర్గే వాస్తవానికి రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవిలో కూడా కొనసాగే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 
వాస్తవానికి కాంగ్రెస్‌ చీఫ్‌ పదవి కోసం నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయడానికి ముందు ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. అయితే కనీసం పార్లమెంటు శీతాకాల సమావేశాల వరకైనా ఖర్గేను కొనసాగించవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది కాంగ్రెస్‌ పాలసీకి విరుద్ధమని కూడా ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
కాగా, సోనియాగాంధీ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక కమిటీ  సమావేశానికి అర్ధాంతరంగా పిలుపునిచ్చారు. మల్లికార్జున్‌ ఖర్గే, జైరాం రమేష్‌, కె.సి. వేణుగోపాల్‌లను మాత్రమే   సమావేశానికి ఆహ్వానించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
గతంలో రాజ్యసభ ప్రతిపక్ష నేతలుగా కొనసాగిన దిగ్విజయ్  సింగ్‌, పి.చిదంబరంలను ఈ సమావేశానికి ఆహ్వానించలేదని  సమాచారం. ఇప్పుడు కూడా ఖర్గే స్థానంలో ప్రతిపక్ష స్థానానికి వీరిద్దరే ముఖ్యంగా పోటీ పడుతున్నారు. ఇటీవల పార్టీ అధ్యక్ష పదవికోసం మొదట పార్టీ అధిష్టానం అశోక్‌ గెహ్లాట్‌ను ఎంపిక చేయడం తెలిసిందే.
అయితే అధ్యక్ష పదవికి ఎంపికైతే పార్టీ సిద్ధాంతం ప్రకారం రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాల్సి వుంటుందని అధిష్టానం స్పష్టం చేసింది. తాను జాతీయ అధ్యక్షుడి పాత్రను స్వీకరిస్తే ఆయన పత్య్రర్థి సచిన్‌ పైలెట్‌ను ముఖ్యమంత్రిగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ గెహ్లాట్‌ తన ఎమ్మెల్యేల మద్దతుతో తిరుగుబాటు ప్రకటించారు.
రెండు పదవుల్లోనూ కొనసాగనించేందుకు  రాహుల్, సోనియా తీవ్ర  విముఖత వ్యక్తం చేశారు. ఒకే వ్యక్తి,  ఒకే పదవి నియమానికి కట్టుబడాలని స్పష్టం చేశారు.  దీంతో గెహ్లాట్‌ అధ్యక్షపదవి పోటీ నుండి వైదొలిగారు.   ఆ తర్వాత ఖర్గేను  అధ్యక్ష పదవికి  ఎంపిక చేశారు.