ఐసిస్ చీఫ్ అబూ అల్ హసన్ అల్ ఖురేషీ హతం

ఇస్లామిక్ స్టేట్ (ఐసీస్‌) ఉగ్రవాద సంస్థ అధినేత హసన్ అల్ హషిమీ అల్ ఖురేషి హతమయ్యాడు. ఈ మేరకు ఉగ్రవాద సంస్థ ఓ ఆడియో ద్వారా ప్రకటించింది. ఇరాక్‌కు చెందిన హషిమి దేవుడి వ్యతిరేకులతో జరిగిన యుద్ధంలో మరణించినట్టు ఐసిస్ పేర్కొంది. అయితే, ఎప్పుడు? ఎక్కడ? అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు.
 

ఖురేషీ హతమవడంతో అతడి స్థానంలో కొత్త చీఫ్‌గా అబు అల్-హుస్సేన్ అల్ హుస్సేని అల్-ఖురేషిని నియమించింది. ఐసిస్ చీఫ్ హతమైనట్టు ఆడియో ద్వారా వెల్లడించిన వ్యక్తే కొత్త చీఫ్ అని తెలుస్తోంది. ఖురేషి అనేది మహ్మద్ ప్రవక్త తెగను సూచిస్తుంది.

ఇరాక్, సిరియాలలో తమ స్లీపర్ సెల్స్ ద్వారా పెద్ద ఎత్తున దాడులు చేయడం ద్వారా తిరిగి  పుంజుకోవాలని చూస్తున్న ఈ ఉగ్రవాద సంస్థ ఈ సంవత్సరం రెండోసారి కీలక నేతను కోల్పోయిన్నట్లయింది. ఈ సంస్థకు అనుబంధంగా ఉన్న ఉగ్రవాద బృందాలు ఆఫ్ఘానిస్తాన్ లో డజన్ల కొద్దీ పౌరులను చంపుతున్నట్లు తరచూ ప్రకటనలు చేస్తున్నది. 

ఖురేషి గురించి ఎలాంటి వివరాలు వెల్లడించకున్నా ఐసిస్ సీనియర్ లీడర్ అని మాత్రం తెలుస్తోంది. అబూ అల్ హసన్‌కు ముందు ఐసిస్ చీఫ్‌గా వ్యవహరించిన అబూ ఇబ్రహీం అల్-హషిమి అల్-ఖురేషీ అమెరికా బలగాల దాడి నుంచి తప్పించుకునేందుకు తనను తాను పేల్చేసుకున్నాడు. 

ఫిబ్రవరిలో సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో అమెరికా బలగాలు ఆయన ఉంటున్న ఇంటిని చుట్టుముట్టాయి. దీంతో మరో మార్గం లేక తనను తాను పేల్చేసుకున్నాడు. అంతకుముందు అమెరికా కమాండోల దాడిలో ఐసిస్ కీలక నేత అబూ బకర్ అల్ బగ్దాది హతమయ్యాడు. ఆ తర్వాత 31 అక్టోబరు 2019లో ఖురేషీ ఐసిస్ చీఫ్ అయ్యాడు.