గుజరాత్ లో ముమ్మరంగా పోలింగ్.. ఓ బీజేపీ అభ్యర్థిపై దాడి

రెండు దశల్లో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఇవాళ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.  పెద్ద సంఖ్యలో ఓటర్లు రావడంతో పోలింగ్ బూత్ ల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి.  రాష్ట్రంలో తొలి దశ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో 89 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది.
మొదటి దశలో ఎన్నికలు జరుగుతున్న 89 స్థానాల్లో 2017 ఎన్నికల్లో బిజెపి 48, కాంగ్రెస్ 40, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. అయితే ఇవాళ గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరుగుతున్న సమయంలో నవ్‌సారి జిల్లాలోని జారి గ్రామంలో వాన్‌స్దా అసెంబ్లీ నియోజకవ బీజేపీ అభ్యర్థి పీయూష్ పటేల్‌పై దాడి జరిగింది. 

చిఖిల్ టౌన్ నుంచి కారులో ఇంటికి తిరిగి వస్తున్న పీయూష్ పటేల్ పై జారి గ్రామ సమీపంలో 30 నుంచి 40 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అతనిపై దాడి చేసి కారును ధ్వంసం చేశారు. ఈ దాడిలో పీయూష్ పటేల్‌కు కూడా తీవ్ర గాయాలు కాగా, అతన్ని కోర్టెజ్ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే అనంత్ పటేల్, ఆయన మద్దతుదారులే దాడికి పాల్పడ్డారని బీజేపీ అభ్యర్థి పీయూష్ పటేల్‌ ఆరోపించారు.

పోలింగ్ జరుగుతున్న 89 సీట్లు..కచ్- సౌరాష్ట్ర,దక్షిణ గుజరాత్ ప్రాంతంలోని 19 జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. తొలి దశలో 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 70 మంది మహిళలు ఉండగా.. 339 మంది స్వతంత్ర  అభ్యర్ధులున్నారు. ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం మొత్తం 25,430 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. తొలిదశలో మొత్తం 2,39,76,670 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ, ఆప్‌‌తో పాటు బీఎస్పీ, బీటీపీ, ఎంఐఎం, సీపీఎం, సీపీఐ, తదితర పార్టీలు, స్వతంత్రులు పోటీలో నిలిచారు. తొలి దశలో ఆప్‌ సీఎం అభ్యర్థి ఇసుదాన్‌ గధ్వీ, మాజీ మంత్రి పురుషోత్తం సోలంకి, ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కున్వార్జి బవలియా, మోర్బీ ‘హీరో’ కాంతిలాల్‌ అమృతీయ, క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా, ఆప్‌ గుజరాత్‌ అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా వంటి ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం కావడంతో బీజేపీ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వరుసగా ఏడోసారి గెలవాలని ఆ పార్టీ సర్వశక్తుల్ని ఒడ్డుతుంటే,  ఈసారి కాషాయ పార్టీ కంచుకోటను బద్దలుకొట్టి పునర్‌ వైభవం చాటుకోవాలన్న  కాంగ్రెస్‌ శ్రేణులు అహర్నిశలూ శ్రమించాయి.

మరోవైపు, చాపకింద నీరులా విస్తరించిన ఆప్ దూకుడు ప్రదర్శించింది. దీంతో ఇప్పటివరకు కేవలం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ ఉండగా, తాజాగా ఆప్‌ బరిలో నిలవడంతో పలుచోట్ల ముక్కోణపు పోరు నెలకుంది