శశిథరూర్ ను వెంటాడుతున్న భార్య సునంద పుష్కర్ మృతి కేసు

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయడం ద్వారా సొంత పార్టీలో ఒక విధంగా ఏకాకిగా మారుతున్న ఎంపీ శశి ధరూర్ ను భార్య సునంద పుష్కర్ మృతి కేసు ఇంకా వెంటాడుతున్నది. ఈ కేసును ఢిల్లీ పోలీసులు మళ్లీ తిరగదోడే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందులో భాగంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 
 
ఈ పరిణామాల మధ్య శశి థరూర్‌కు నోటీసులు జారీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోసారి కోర్టు ముందు నిల్చోవాల్సిన పరిస్థితి ఎదురైంది. శశిధరూర్ భార్య సునంద పుష్కర్ 2014 జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
 మొదట్లో ఆమె హత్యకు గురైనట్లుగా పోలీసులు భావించారు. ఆ కోణంలో దర్యాప్తు సాగించారు ఢిల్లీ పోలీసులు. ఆ తరువాత ఆత్మహత్యగా నిర్ధారించారు. ఆత్మహత్య చేసుకున్నట్లు ఫోరెన్సిక్ నివేదిక సైతం అప్పట్లో ధృవీకరించింది. సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకోవడానికి శశి థరూరే కారణమంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
 
ఈ ఉదంతంలో ఆయనను ప్రధాన నిందితుడిగా చేర్చారు. సుమారు ఏడు సంవత్సరాల పాటు ఈ కేసుపై దర్యాప్తు సాగింది. శశి థరూర్‌ను ప్రధాన నిందితుడిగా నిర్ధారించేలా ఢిల్లీ పోలీసులు ఎలాంటి సాక్ష్యాధారాలను ప్రవేశ పెట్టలేకపోయారు. 
 
దీనితో ఢిల్లి పటియాలా న్యాయస్థానం ఈ కేసులో శశి థరూర్‌కు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆయనపై నమోదు చేసిన ఆరోపణలన్నింటినీ కొట్టివేసింది. ఈ మేరకు 2021 ఆగస్టు 18వ తేదీన తీర్పు వెలువడించింది. అప్పట్లో పటియాలా న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ పోలీసులు ఇప్పుడు తాజాగా అప్పీల్‌కు వెళ్లారు. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
సునంద పుష్కర్ మృతి కేసులో పటియాలా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించి, శశి థరూర్‌కు నోటీసులను జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది.