ఆదాయంలో సగంకు పైగా వడ్డీకే చెల్లిస్తున్న జగన్ ప్రభుత్వం

వస్తున్న ఆదాయంలో అధిక భాగం చేసిన అప్పులకు చెల్లించాల్సిన వడ్డీలకే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సరిపోతుంది. ఏడాదికేడాది వడ్డీల భారం పెరిగిపోతుండటంతో ఇతర కార్యక్రమాలకు నిధులు చాలని పరిస్థితి నెలకొంది. తాజాగా రిజర్వ్‌బ్యాంకు ప్రకటించిన గణాంకాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
 
 వీటి ప్రకారం రాష్ట్ర ఆదాయంలో సగానికి పైగా వడ్డీలకు చెల్లించాల్సి వస్తుంది. గత ఆరేళ్లలో వడ్డీలకు చెల్లించే మొత్తం రెట్టింపు కన్నా ఎక్కువగా రికార్డయింది. రాష్ట్ర అవసరాల కోసం తీసుకునే అప్పుల్లో ఎక్కువ శాతం సెక్యూరిటీ- బ్యాండ్లను తనఖా పెట్టడం ద్వారా బహిరంగ మార్కెట్‌ రుణాల నుంచి తీసుకుంటుండగా, విద్యుత్‌ బ్యాండ్లు, వేస్‌ అండ్‌ మీన్స్‌, నబార్డ్‌ రుణాలు, జాతీయ సహకారాభివృద్ధి సంస్థ నుంచి, ఇతర బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు ఉంటాయి.
వీటిపై ప్రతి నెలా తప్పనిసరిగా వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 22,740 కోట్లను ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో వడ్డీగా చెల్లించాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన జరిగిన 2014-15లో రూ. 10,007 కోట్ల  వడ్డీని చెల్లించగా, 2015-16లో కొరత వరకు తగ్గి రూ. 9,848 కోట్లు వడ్డీకి చెల్లించారు. అయితే అక్కడి నుంచి మళ్లీ పెరుగుతూ ఖజానాకు భారంగా మారుతుంది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో వడ్డీ భారం రూ. 22 వేల కోట్లు- దాటిపోవడం గమనార్హం.

దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వడ్డీ భారం పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌ రూ. 41,603 కోట్ల వడ్డీ చెల్లింపులతో అగ్రస్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, కేరళ, గుజరాత్‌ రాష్ట్రాలు ఉన్నాయి. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రూ. 17,584 కోట్ల వడ్డీ భారంతో ఉండడం గమనార్హం.