ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును గురజాడ అప్పారావు పురస్కారానికి ఎంపిక చేయడం పట్ల కొందరు వివాదం రేకెక్తిస్తున్నారు. గురజాడ అప్పారావు జీవితాంతం హేతువాదిగా, అభ్యుదయవాదిగా ఉన్నారని.. అలాంటప్పుడు దేవుడి గురించి ప్రవచనాలు బోధించే చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ఎలా ఇస్తారంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
సంగీత, గాన, సాహిత్య, ఆధ్యాత్మిక తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఏటా ప్రదానం చేస్తున్న గురజాడ విశిష్ట పురస్కారానికి ఈ ఏడాది చాగంటి కోటేశ్వరరావును ఎంపిక చేశారు. చాగంటికి ఈ నెల 30న గురజాడ అప్పారావు వర్ధంతి రోజున పురస్కారం అందజేస్తామని తెలిపారు.
అయితే, గురజాడ అప్పారావు విశిష్ట పురస్కారాన్ని చాగంటికి ఇవ్వడంలో అసలు అర్థం లేదని కొందరు హేతువాదులు, కవులు, కళాకారులు మండిపడుతున్నారు. చాగంటికి ప్రతిష్టాత్మక గురజాడ విశిష్ట పురస్కారాన్ని ప్రకటించడాన్ని నిరసిస్తూ విజయనగరంలో సాహితీవేత్తలు, కవులు, కళాకారులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు.
ఈ అవార్డును వెనక్కి తీసుకోవాలని కోరుతూ సాహితీ స్రవంతి, జెవివి, పలు సాహితీ సంఘాల ఆధ్వర్యాన గురజాడ గౌరవ యాత్ర చేపట్టారు. గురజాడ నివాసం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర మూడు లాంతర్లు, గంట స్తంభం, ఎంఆర్ కళాశాల మీదుగా కోట వరకూ సాగింది.
కాగా, చాగంటి కోటేశ్వరరావుకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అండగా నిలిచింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చాగంటికి మద్దతు పలుకుతూ ట్వీట్ చేశారు. ‘‘గురజాడ’’ అవార్డు ఎవరికి ఇవ్వాలి అనే విషయం అవార్డు అందించే వ్యక్తులు, సంస్థల అభిప్రాయంపై ఆధారపడిన అంశం. నా దృష్టిలో బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఏ అవార్డుకు అయినా అర్హులే” అంటూ స్పష్టం చేశారు.
పైగా, చాగంటి గారు అద్భుతమైన జ్ఞాన బాండాగారం అని పేర్కొంటూ రోడ్లపై ధర్నాలు చేస్తూ చాగంటి గారి పేరు ఉచ్చరించే అర్హత ఎవరికీ లేదని ఆయన మండిపడ్డారు. అవార్డుల పేరుతో ఆయన కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
More Stories
అయోధ్య రామయ్యకు టిటిడి పట్టువస్త్రాలు
గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి
ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు