రాజ్యాంగ బద్ద పదవిలో ఓ మహిళా ఉండటం కేసీఆర్ కు ఇష్టం లేదేమో!

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఒక మహిళ ఉండటం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇష్టం ఉండదేమోనని, అందుకే అడుగడుగునా తనను అవమానిస్తున్నారని గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ సందేహం వ్యక్తం చేశారు. గవర్నర్ పై జరుగుతున్న అవమానాలకు రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలని ఆమె రిపబ్లిక్ టివి ఛానల్ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామితో మాట్లాడుతూ స్పష్టం చేశారు.
 
రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామని, అసలు ఆయన హాజరవుతారా లేదా అనే సమాచారం కూడా ఇవ్వలేదని గవర్నర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను హాజరయ్యే కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావడం లేదని ఆమె చెప్పుకొచ్చారు.
 
“నేను హాజరవుతున్న అధికారిక కార్యక్రమాలకు కూడా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావడం లేదు. నేను గవర్నర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఇదే పరిస్థితి నెలకొంది” అని పేర్కొన్నారు. మహిళా గవర్నర్ అని తనపై వివక్ష చూపిస్తున్నారని, రాజ్ భవన్ ను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
‘‘రాజ్ భవన్ కు, గవర్నర్ హోదాకు మర్యాద ఇవ్వడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగానే నాపై విమర్శలు చేస్తున్నారు. ప్రోటోకాల్ పాటించడం లేదు. జిల్లాలకు వెళ్తే కలెక్టర్, ఎస్పీ రావడం లేదు. యూనివర్సిటీ కాన్వొకేషన్ కు వెళ్తే మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకావడం లేదు. పాలమూరు యూనివర్సిటీ కాన్వొకేషన్ కు వెళ్తే, అక్కడికి మంత్రులు, ఎమ్మెల్యేలు రాలేదు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అవసరం లేదంటూ తీర్మానం చేశారు. ఇదేం వివక్ష? ఇదేం మర్యాద? దీనికి రాష్ర్ట ప్రభుత్వం జవాబు చెప్పాలి” అని ఆమె డిమాండ్ చేశారు.
 
అసెంబ్లీలో ప్రసంగించే అవకాశాన్ని కూడా కల్పించడం లేదని, ప్రజల మధ్య గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించే అవకాశం లేకుండా చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ చర్యలన్నీ గవర్నర్‌ పదవిని అవమానపరచడమేనని ఆమె స్పష్టం చేశారు.
 
“మా అమ్మ చనిపోతే రాష్ట్రపతి, ప్రధాని ఫోన్ చేసి పరామర్శించారు. కానీ సీఎం మాత్రం పరామర్శించలేదు” అని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని రాష్ర్టానికి వస్తే సీఎం ఎందుకు రిసీవ్ చేసుకోలేదని ఆమె ప్రశ్నించారు. ‘‘ఆగస్టు 15న రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం వస్తారని సమాచారం ఇచ్చారు. సీఎం కోసం నేను, హైకోర్టు చీఫ్ జస్టిస్ వేచి చూసాం. కానీ సీఎం రాలేదు. రావడం లేదని కూడా సమాచారం ఇవ్వలేదు. అసలు రాజ్ భవన్ కు సీఎం ఎందుకు రావడం లేదు?” అని ఆమె ప్రశ్నించారు.
 
గత నెలలో తన ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతోందని సందేహం వ్యక్తం చేసిన గవర్నర్‌..తనపై కూడా నిఘా ఉందని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. కనీస ప్రోటోకాల్‌ను పాటించరని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేసారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన అగ్నిపథ్‌ ఆందోళన సమయంలో రాజ్‌భవన్‌ ముందు ఆందోళన చేయాలని ట్వీట్‌ చేయడం ఏమిటని గవర్నర్‌ ప్రశ్నించారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానం అమల్లో ఉందని ఆమె ఆరోపించారు.  అసెంబ్లీలో తన ప్రసంగం లేకుండా వివక్ష చూపుతున్నారని ఇందు కోసం ఏకంగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అవసరం లేదంటూ తీర్మానం చేశారని ఆమె తెలిపారు. ఇదేం వివక్ష అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి, సమగ్రతకు రాజ్యాంగమే మూలమని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. ఏడు దశాబ్దాలకు పైగా అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ, దేశంలో దృఢమైన ప్రజాస్వామ్య పునాదుల్ని నిర్మించడంలో భారత రాజ్యాంగం అత్యున్నతమైనదిగా నిలిచిందని ఆమె చెప్పారు.