బీఎల్ సంతోష్‭కు ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే

ఫామ్ హౌస్ కేసులో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు  సిట్ జారీ చేసిన  నోటీసులపై తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 5 వరకు స్టే విధించింది. నోటీసులు చట్టపరంగా లేవని  చెప్పింది. సిట్ నోటీసులు రద్దు చేయాలంటూ శుక్రవారం బీఎల్ సంతోష్ హైకోర్ట్ లో  దాఖలు  చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. 

తనపై తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేస్తోందని, సంబంధంలేని వ్యవహారంలో తన పేరును ప్రచారం చేస్తున్నారని బీఎల్ సంతోష్ తన పిటిషన్ లో ఆరోపించారు. సీఆర్పీసీ నోటీసులను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. 
ఈ సందర్బంగా..  41ఏ సీఆర్ పీసీ నోటీసులు ఎలా ఇస్తారని సంతోష్ తరపు న్యాయవాది దేశాయ్ ప్రకాష్ వాదనలు వినిపించారు. ఫామ్ హౌస్ కేసులో సంతోష్ అనుమానితుడు కాదని, నిందితుడు కూడా కాదని స్పష్టం చేశారు. పోలీసులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కోర్టును కోరారు. 
రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సిట్ పై నమ్మకం లేదని  సంతోష్ తరపు లాయర్  తెలిపారు. నోటీసుల పేర్లతో బీఎల్ సంతోష్ ని పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. రాజకీయ లబ్ది కోసమే సీఎం కేసీఆర్ ఈ కేసు విచారణలో కలుగజేసుకున్నారని వాదించారు. వాదనల అనంతరం సిట్ నోటీసులు చట్టపరంగా లేవన్న హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 5 కు వాయిదా వేసింది.
మరోవంక, ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్న ముగ్గురు నిందితులు ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయగా, న్యాయమూర్తి దాన్ని తిరస్కరించారు. దీంతో ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ధర్మాసనం రేపు విచారణ జరపనుంది.