యాసంగి పంటలకు నీటి విడుదలపై కృష్ణా నదీ యాజమాన్యం బోర్డుతో ఆంధ్ర,తెలంగాణ ఈఎన్సీలు డిసెంబర్ 6న జలసౌధలో సమావేశం కానున్నారు. తెలంగాణ ఇంజనీరంగ్ ఇన్ చీఫ్ సి. మురళీధర్, ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డిలతో కెఆర్‌ఎంబీ సమావేశం కానుంది. తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
జలవిద్యుత్, రూల్ కర్స్య్, వరద జలాల అంశాలపై చర్చించనున్నారు. 2022-2023 సాగు, తాగునీరు అవసరాలకు నీటి విడుదలపై కూడా ఈ సమావేశంలో కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి రెండు రాష్ట్రాల ఈ ఎన్సీలతో భేటీ అయి నీటి విడుదల ఉత్తర్వులు జారీచేయనున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్ తోపాటుగా రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి అవసరాల కోసం నీటి వాటాల పెంపుకు ఇరు రాష్ట్రాలు పట్టుబట్టనున్నాయి. అయితే నీటి లభ్యత, అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి విడుదల అంశంపై కెఆర్‌ఎంబీ ఉత్తర్వులు జారీచేయనుంది.
ప్రస్తుత నీటి సంవత్సరంలో ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉంది. కృష్ణా ,నాగార్జున సాగర్ లలో నీటి మట్టాలు పుష్కలంగా ఉండటంతో పాటుగా వరద జలాలు కూడా వచ్చి చేరుతుండటంతో నీటి వాటాలకోసం పట్టుబట్టనున్నారు. అయితే ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ కు నీటిని తరలిస్తుండటంతో నీటి కేటాయింపుల్లో తమకు అనుకూలంగా కేటాయింపులు ఉండాలని ఈ సమావేశంలో తెలంగాణ పట్టుబట్టనుంది.
అలాగే శ్రీశైలం జలవిద్యుత్ కు ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు ఉండాలని తెలంగాణ పట్టుబట్టనుంది. తెలంగాణలో కృష్ణానదీ జలాలను నింపుకోవడానికి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, నికర జలాల కేటాయింపులో అన్యాయం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం నీటి సంవత్సరానికి తెలంగాణకు నీటి కేటాయింపులు అవసరాలకు సరిపోయే విధంగా ఉండాలని ఈ సమావేశంలో తెలంగాణ వాదనలు వినిపించేందుకు సిద్దం అవుతుంది.
ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి సామర్ధ్యం 312.05 ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 308.47 టీఎంససీలు ఉంది. అలాగే ఇన్ ఫ్లో 394606 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో కూడా ఇన్ ఫ్లోకు సమానంగా ఉంది. అలాగే శ్రీశైలంలో నీటి సామర్థ్యం 215.81 టీఎంసీలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 211. 48 టీఎంసీలు ఉంది. అలాగే ఇన్ ఫ్లో 401187 ఉండగా ఔట్ ఫ్లో 445745 క్యూసెక్కులు ఉంది. ఈ రెండు ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిలువలు ఆశాజనకంగా ఉండటంతో యాసంగీ పంటలకు, తాగునీటికి సమస్యలు ఉత్పన్నం కాకుండా నీటి కేటాయింపులు ఉంటాయనే ఆశాభావం వ్యక్తమవుతుంది.
More Stories
ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య జ్యుడీషియల్ కమిషన్
ఈడీ విచారణకు కాంగ్రెస్ నేత అజారుద్దీన్
రుణమాఫీపై బహిరంగ చర్చకు రేవంత్ కు ఏలేటి సవాల్!