బిజెపిలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి డా. మర్రి చెన్నారెడ్డి తనయుడు, మాజీ మంత్రి  మర్రి శశిధర్ శుక్రవారం బిజెపిలో చేరారు. ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. కేంద్ర మంత్రి శర్బానంద్ సోనోవాల్ ఆయనకు బిజెపి కండువా కప్పి పార్టీలోకి అహ్వనించారు. తర్వాత బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాను కలిశారు. 
ఈ సందర్భంగా కేంద్రమంత్రి శర్బానంద్ సోనోవాల్ మాట్లాడుతూ  తెలంగాణలో కాంగ్రెస్ అంతం ప్రారంభమైందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొవడం కాంగ్రెస్ వల్ల కాదని, అందుకే మర్రి బీజేపీలో చేరారని తెలిపారు. మర్రి శశిధర్ రెడ్డి చేరికతో తెలంగాణలో బీజేపీకి మరింత బలం పెరిగిందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు కాలం చెల్లినట్లేనని వెల్లడించారు.  ఇటీవల కాంగ్రెస్ కు శశిధర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రజలు మంచి సర్కారును కోరుకున్నరు, కానీ అది రాలేదని చెబుతూ మొత్తం ప్రపంచంలో ఇంత అవినీతి ప్రభుత్వం ఎక్కడా లేదని శశిధర్ రెడ్డి ఈ సందర్భంగా ఆరోపించారు.
గత ఎనిమిదిన్నర ఏళ్లుగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విఫలం మైనదని చెబుతూ ప్రధాని నరేంద్ర మోదీ  నాయకత్వంలో దేశం ముందుకు వెళుతోందని చెప్పారు. అందుకనే తాను ఎంతో ఆలోచించాకే బిజెపిలో చేరానని తెలిపారు. 
 
రాష్ట్రంలో టిఆర్ఎస్ కు బుద్ధి చెప్పడం బిజెపితోనే సాధ్యమవుతుందని, ఇలాంటి ఘట్టంలో భాగస్వామ్యం అవుతున్నందుకు తనకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. బిజెపి బలోపేతానికి కృషి చేస్తానన్న చెబుతూ రాష్ట్రంలో బిజెపి సర్కారు ఏర్పాటుకు ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు. 
 
మర్రి బీజేపీలోకి రావడం తెలంగాణలో పార్టీ బలోపేతానికి దోహదం చేస్తుందని చెబుతూ శశిధర్ రెడ్డితో కలిసి తాము పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో మార్పు స్పష్టం చేస్తూ కుటుంబ పాలన, అహంకార పూరిత పాలన పోవాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్​ బరితెగించి అధికార దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.
 
కల్వకుంట్ల కుటుంబమే తెలంగాణకు దిక్కు అనేలా పాలన నడుస్తోందని మండిపడుతూ తెలంగాణలో అభివృద్ధి ఆగిపోయిందని ఆయన విమర్శించారు. తన కుటుంబాన్ని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడంపైనే కేసీఆర్​ దృష్టి పెట్టారని, అందుకే బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని కల్వకుంట్ల కుటుంబం  బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం పార్టీలోని నాయకులమంతా కలిసికట్టుగా పనిచేస్తామని బిజెపి రాష్త్ర అధ్యక్షుడు  బండి సంజయ్ చెప్పారు. “తెలంగాణ అభివృద్ధి గురించి కేసీఆర్​ ఆలోచించడం లేదు. కనీసం జీతాలు కూడా ఇయ్యలేని స్థితిలో  రాష్ట్రం ఉంది. సంక్షేమ పథకాలను సైతం అమలు చేయలేకపోతున్నరు. కాంగ్రెస్​, టీఆర్ఎస్​ పార్టీలు లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకొని.. పైకి కొట్లాడుతున్నట్లు నాటకాలు ఆడుతున్నాయి” అని మండిపడ్డారు.