ఏపీలో వైసీపీ నేతల వద్దే రూ. 2,000 నోట్లు

ఏపీలోని ఏటీఎంలలో 2 వేల నోట్లు కనిపించడం లేదని, అవన్నీ వైసీపీ నేతల వద్దే ఉన్నాయని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. దీనిపై ఆర్బీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే ఇందులో వాస్తవాలు బయటికి వస్తాయని పేర్కొన్నారు.
 
మరోవైపు సీఎం జగన్ సభలో మహిళల చున్నీలు తీయించిన ఘటన పైనా విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. సీఎం సభలకు వెళ్లిన మహిళల చున్నీలు తీయించడం కంటే దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు తప్పుగా కనిపించడం లేదా అని నిలదీశారు.
 
ప్రభుత్వం తమ చర్య సరైనదే అని భావిస్తుంటే సీఎం సభలకు డ్రెస్ కోడ్ ప్రకటిస్తూ జీవో జారీ చేయాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. మరోవంక, శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటనకు వస్తున్నారని బీజేపీ నేత శ్రీనివాస వర్మను హౌస్ అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ ఏపీలో మాత్రం బీజేపీ నేతలను జైళ్లలో వేస్తున్నారని విష్ణుకుమార్ రాజు విమర్శించారు.


విశాఖలో దసపల్లా భూముల అక్రమాల వివాదంపై ప్రస్తావిస్తూ ఈ వివాదంలో కలెక్టర్‌పై విపరీతమైన ఒత్తిడి ఉందని తెలిపారు. జిల్లా కలెక్టర్ జైలుకు వెళ్లకుండా ఉండాలంటే 22ఏ విషయంలో విచక్షణతో వ్యవహరించాలని విష్ణు సూచించారు. రుషికొండ నిర్మాణాలపై దాపరికం ఎందుకని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఇందులో ఏం జరుగుతుందో బహిర్గతం చేయాలని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కాం జరుగుతోందని ఆరోపించారు. నిపైనా విచారణ చేయించాలని కోరారు.