భారత్, భూటాన్ సంయుక్త శాటిలైట్లను నింగిలోకి పంపనున్న ఇస్రో

ఓషన్‌శాట్-3తో పాటు భారత్, భూటాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఎనిమిది నానో శాటిలైట్లను ఇస్రో నింగిలోకి పంపనుంది. విజయవంతమైన రాకెట్గా పేరుగాంచిన పీఎస్ఎల్వీ లాంచ్ వెహికల్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ ఏడాది అయిదో ప్రయోగాన్ని చేపడుతోంది. ఈ ఉపగ్రహాన్ని సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లోకి ప్రయోగించనున్నారు.

2019లో ప్రధాని నరేంద్ర మోదీ థింపూ పర్యటన తర్వాత అంతరిక్ష ప్రయోగం సంయుక్తంగా చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒప్పందాన్ని భారతదేశం సెప్టెంబర్ 2021లో భూటాన్‌తో కుదుర్చుకుంది. 30 సెంటీమీటర్ల క్యూబిక్ ఉపగ్రహాన్ని భూటాన్ ఇంజనీర్లు తయారు చేశారు. ఇది భూటాన్ మీదుగా ఎగురుతూ భూమి ఉపరితలం చిత్రాలను తీస్తుంది.

15 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం భూటాన్ ఉపరితలాన్ని రోజుకు కనీసం రెండు మూడు సార్లు కవర్ చేస్తుంది. భూటాన్ ఇంజనీర్లు మాత్రం తక్కువ రిజల్యూషన్‌తో ప్రస్తుతం ఫొటోలు ఉంటాయని అంటున్నారు.  భూటాన్ 2019లో తన మొదటి ఉపగ్రహం భూటాన్-1ను అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టింది. ఇది విద్య ఆధారిత క్యూబ్‌శాట్.

అదే సమయంలో ఓషన్‌శాట్ శ్రేణి ఉపగ్రహాలు భూమి పరిశీలన, నీటి వనరుల పర్యవేక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. మొదటి  ఓషన్‌శాట్ 1999లో భూమి పైన దాదాపు 720 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలార్ సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లో ప్రయోగించారు. కాగా, సముద్ర శాస్త్ర అధ్యయనాల కోసం ఉపగ్రహం ఓషన్ కలర్ మానిటర్ (ఓసీఎమ్), మల్టీ-ఫ్రీక్వెన్సీ స్కానింగ్ మైక్రోవేవ్ రేడియోమీటర్ ని మోసుకెళ్లింది. ఈ ఉపగ్రహం 2010, ఆగస్ట్ 8 నుంచి  కక్ష్యలో 11 సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉంది.

ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ అభివృద్ధి చేసిన ఓషన్ కలర్ మానిటర్ (ఓసీఎమ్), కు-బ్యాండ్ పెన్సిల్ బీమ్ స్కాటరోమీటర్ (స్కాట్), రేడియో అక్యుల్టేషన్ సౌండర్ ఫర్ అట్మాస్పియర్ (రోసా) అనే మూడు పేలోడ్‌లతో 2009లో  పీఎస్ఎల్వీ -సి14 మిషన్‌లో ఓషన్‌శాట్-2 సక్సెస్ అయ్యింది.