చైనాలో రికార్డు స్థాయిలో 31,454 మందికి కరోనా

కరోనా పుట్టిళ్లు చైనాలో మహమ్మారి విజృంభిస్తున్నది. దీంతో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 31,454 కేసులు రికార్డయ్యాయని నేషనల్‌ హెల్త్‌ బ్యూరో తెలిపింది. ఇందులో 27,517 మందికి ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించింది.  దీంతో కరోనా కేసులు ప్రారంభమైన నాటినుంచి ఒక్కరోజులో ఇంత మందికి పాజిటివ్‌ రావడం ఇదే మొదటిసారని పేర్కొన్నది. బుధవారం 29,390 కేసులు నమోదయ్యాయని చెప్పింది.
లాక్‌డౌన్లతో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే చైనా ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కరోనా సోకిన నగరాల్లో కఠినమైన నిర్బంధం విధిస్తున్నారు. అయినా కూడా కరోనా కేసులు మళ్లీ ఎక్కువవుతుండడంతో అక్కడి ప్రజలు భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. షాంఘై నగరంలో కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించినా 29,390 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్లు అమలు చేస్తుండగా, ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నారు. భారీ సంఖ్యలో పరీక్షలు చేస్తున్నారు. చైనాలో గత కొన్ని రోజులుగా 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ‘జీరో కరోనా’ విధానం మేరకు మళ్లీ కొత్త ఆంక్షలను అధికారులు ప్రకటించారు. సుమారు ఆరు నెలల తర్వాత ఈ నెల 20న చైనాలో తొలి కరోనా మరణం నమోదైంది.
రాజధాని బీజింగ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 87 ఏళ్ల వృద్ధుడు ఆదివారం మరణించాడు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,227కు చేరింది. ఈ నేపథ్యంలో ఆ దేశ అధికారులు మళ్లీ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.  ఆన్‌లైన్‌ టీచింగ్ విధానానికి స్కూళ్లు మళ్లాయి. కార్యాలయాలు, రెస్టారెంట్లను మూసివేశారు. అనవసరంగా బయటకు రావద్దని ప్రజలకు సూచించారు.
 
ఐఫోన్‌ ఉద్యోగుల ఆందోళన 
చైనాలో అమలు చేస్తున్న కరోనా కఠిన నిబంధనలు ఉద్రిక్తలకు దారితీస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్​ తయారీ కంపెనీ అయిన ఫాక్స్​కాన్​లో వేలాది మంది కార్మికులు క్వారంటైన్​లో ఉన్నారు. వీరికి ఎలాంటి సదుపాయాలు లేవు. దీనికితోడు అక్కడే పనిచేస్తున్న వారికి కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో వారంతా ప్రభుత్వంతో పాటు కంపెనీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
 
చైనాలోని జెంగ్‌జూలో ఉన్న యాపిల్‌ ఐఫోన్‌ ప్లాంట్‌లో జీరో కరోనా పాలసీ పేరుతో విధించిన ఆంక్షలతో విసుగెత్తిన ఉద్యోగులు బుధవారం ఉదయం ఒక్కసారిగా ఆందోళనకు దిగారు.  అదికాస్తా ఉద్రిక్తతలకు దారితీయడంతో ప్రభుత్వం జెంగ్‌జూలో పట్టణంలో లాక్‌డౌన్‌ విధించింది.  అత్యవసరమైతే తప్ప ప్రజలు తమ ఇండ్లలోనుంచి బయటకు రాకూడదని ఆదేశించారు.
చైనాలోని జెంగ్‌జూ ప్రాంతంలో గల  యాపిల్‌ తయారీ కేంద్రం ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌ లో ఐఫోన్లను తయారుచేస్తున్నారు.  కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్లాంట్‌లో పనిచేసే ఉద్యోగులు బయటకు వెళ్లకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.  చాలా మంది ఇంటి ముఖం చూడక చాలా రోజులైందని అక్కడి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీరో కొవిడ్‌ పాలసీ పేరుతో కఠిన ఆంక్షలు విధించారు.
ఈ ఆంక్షలతో విసుగెత్తిన ఉద్యోగులు వందలాది మంది ఒక్కసారిగా విధులు బహిష్కరించి బయటకొచ్చి ఆందోళనకు దిగారు. సరైన వసతులు కల్పించడంలేదని, జీతాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదని ఉద్యోగులు ఆరోపించారు. కరోనా  బాధపడుతున్న చాలా మంది ఉద్యోగులు ఈ యూనిట్‌లో ఉన్నప్పటికీ.. వారికి వేరే గదులు కేటాయించడం లేదని ఆందోళన చెందుతున్నారు.