పాక్ రాజకీయాల్లో సైన్యం జోక్యం … ఒప్పుకున్న ఆర్మీ చీఫ్

గత 70 ఏండ్లుగా పాకిస్తాన్‌ దేశ రాజకీయాల్లో సైన్యం జోక్యం చేసుకుంటున్నదని ఆ దేశ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వా అంగీకరించారు. ఈ నెల 29 న పదవీ విరమణ చేయనున్న సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో బజ్వా చేసిన ప్రసంగం పాకిస్తాన్‌లో కలకలం రేపుతున్నది.
ఇప్పటివరకు రాజకీయాల్లో సైన్యం మితిమీరిన జోక్యం చూశామని, ఇకముందు అలా జరుగకుండా చూడాల్సిన బాధ్యత ఆర్మీపై ఉన్నదని బజ్వా హితవు పలికారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని గత ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకున్నట్లు బజ్వా వెల్లడించారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులకు మరీ ముఖ్యంగా ఇమ్రాన్‌ఖాన్‌కు ఆయన పేరు లేవనెత్తకుండానే కొన్ని సలహాలిచ్చారు.
సైన్యం గురించి మాట్లాడేటప్పుడు పాకిస్తాన్‌ రాజకీయ నాయకులు తరచుగా నోరు జారుతున్నారని జనరల్‌ బజ్వా విచారం వ్యక్తం చేశారు. ఇకముందు మంచి పదాలను ఎన్నుకోవాలని కోరారు. ఇటీవలి కాలంలో సైన్యంపై రాజకీయ నేతలు వాడిన భాష అభ్యంతరకరంగా ఉన్నదని స్పష్టం చేసారు.

సైన్యం గురించి తప్పుడు విషయాలు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. సైన్యంపై విమర్శలు చేసే సమయంలో స్వరం పెంచుతున్నారని మండిపడ్డారు. తన ప్రభుత్వం పడిపోవడంలో మిలిటరీ పాత్ర ఉన్నదని ఇమ్రాన్‌ఖాన్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.

సైన్యం తప్పులు చేయడం లేదని తాను అనడం లేదని, ఈ తప్పుల్లో పాక్‌ రాజకీయ నేతలతో పాటు పౌర సమాజం పాత్ర కూడా ఉన్నదని జనరల్‌ బజ్వా పేర్కొన్నారు. కష్టతరమైన దశను ఎదుర్కొంటున్న మన దేశాన్ని కాపాడుకునేందుకు స్వార్ధం, అహంను పక్కన పెడదాం అని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలేదని తేల్చిచెప్పారు.

రాజకీయ పార్టీలు గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని దేశాన్ని ఈ పరిస్థితి నుంచి బయటపడేయాలని ఆయన సూచించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజంగా జరుగుతుంటాయని, వాటిని సీరియస్‌గా తీసుకుని దేశ ప్రజల క్షేమాన్ని పణంగా పెట్టొద్దని హితవు పలికారు. ఇలా ఉండగా, తాను పాల్గొంటున్న పత్రి ప్లాట్‌ఫాంపై ఇమ్రాన్‌ఖాన్‌పై జనరల్‌ బజ్వా తీవ్ర విమర్శలు చేస్తుండటాన్ని రాజకీయ పరిశీలకులు నిశితంగా గమనిస్తున్నారు.

తదుపరి ఆర్మీ చీఫ్‌గా అసిమ్‌ మునీర్‌

కాగా, పాకిస్థాన్‌ తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ అసిమ్‌ మునీర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. ఆర్మీ చీఫ్‌గా 2016 నవంబరు 29న బజ్వా బాధ్యతలు చేపట్టారు. ఆరేళ్లపాటు పదవిలో కొనసాగిన ఆయన ఈ నెలలో పదవీ విరమణ పొందనున్నారు. పాకిస్తాన్ మిలిటరీ ఇంటలిజెన్స్ డైరెక్టర్ జనరల్ గా 21 నెలల పాటు పనిచేసి, తర్వాత ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ అయ్యారు. అయితే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయనను ఆ పదవి నుండి తొందరలోనే తొలగించారు.

తన భార్య బుష్రా బిబిపై అవినీతి ఆరోపణల గురించిన సమాచారాన్ని తన దృష్టికి తీసుకొచ్చినందుకు ఆగ్రహంతో ఆ పదవి నుండి తొలగించారని ప్రతీతి. అయితే మొదటి నుండి ప్రస్తుత ఆర్మీ చీఫ్ బజ్వాకు నమ్మకస్తుడిగా ఉంటూ వచ్చారు.

కాగా, బజ్వా ప్రస్తుతం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్‌ అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే, బజ్వా కుటుంబసభ్యుల సంపద మాత్రం గత ఆరేళ్లలో అమాంతం పెరిగిపోయింది. ఈ మేరకు ఆదాయ పన్ను రికార్డుల ఆధారంగా ఫ్యాక్ట్‌ ఫోకస్‌ వెబ్‌సైట్‌ సంచలన కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం దేశ, విదేశాల్లో ఉన్న బజ్వా ఆస్తుల ప్రస్తుత విలువ రూ.1,270 కోట్లు. ఇది ఆదాయ పన్ను శాఖకు తెలియజేసిన విలువ మాత్రమే అని కథనంలో పేర్కొంది. మరి కొద్ది రోజుల్లోనే ఆర్మీ చీఫ్‌గా బజ్వా పదవీకాలం ముగియనున్న సమయంలో ఈ వార్తలు బహిర్గతమవడం పాక్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.