మల్లారెడ్డిపై ఐటీ సోదాల్లో రూ 10.50 కోట్లు స్వాధీనం 

తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి,  ఆయన బంధువుల ఇళ్లలో వరుసగా రెండో రోజుల పాటూ కొనసాగించినఆదాయ పన్ను(ఐటీ) అధికారుల సోదాలు గురువారం తెల్లవారుజామున ముగిశాయి. తెల్లారి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేసిన .. వాటిని కూడా ముగించారు.
మంగళవారం తెల్లవారుజాము నుండి జరుపుతున్న సోదాలలో రూ 10.50 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది. రెండు సూట్‌ కేస్‌లు, 6 బ్యాగుల్లో వివిధ డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీనిపై మల్లారెడ్డికి నోటీసులు ఇచ్చిన అధికారులు… సోమవారం తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు.
 
ఆయన ఇంట్లో రూ.3 కోట్లు లభించినట్లు తెలిసింది. అలాగే మల్లారెడ్డి బంధువు రఘునందన్ ఇంట్లో రూ.2 కోట్లు, త్రిశూల్ రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, సుధీర్ రెడ్డి ఇంట్లో రూ.2.5 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో రూ.1 కోటి సాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
 
కాగా బుధవారం మల్లారెడ్డి కోడలు, కూతురిని అధికారులు బ్యాంక్‌కు తీసుకెళ్లారు. బాలానగర్ క్రాంతి బ్యాంక్‌లో లాకర్‌లను అధికారులు ఓపెన్ చేయించారు. క్రాంతి బ్యాంకు  లాకర్ లోనే మరో 8 బ్యాంకులకు చెందిన ఆర్థిక లావాదేవీల వివరాలు, 12 బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. 
హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన 400 మందికి పైగా ఐటీ అధికారులు, సిబ్బంది  65 బృందాలుగా ఏర్పడి సోదాలు చేశారు.  తనిఖీల్లో భాగంగా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ నుంచి అధికారులు ఒక కారులో బ్రీఫ్ కేసును తీసుకెళ్లడం మీడియా ప్రతినిధులకు కనిపించింది. అందులో పలు కీలకమైన డాక్యుమెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి కుమారులు మహేందర్‌రెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డితోపాటు సోదరులు, బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
ప్రధానంగా.. మల్లారెడ్డి విద్యాసంస్థల్లో అక్రమాలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ప్రభుత్వ రాయితీలు ఉన్నప్పటికీ అధికంగా ఫీజులు వసూలు చేశారని సమాచారం. అనధికార వసూళ్లను రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులుగా పెట్టినా.. వాటి వివరాలేవీ ఐటీ పత్రాల్లో చూపించలేదని తెలుస్తోంది. అందువల్ల అధికారులు… డబ్బు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
 
లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని స్థిరాస్తి వ్యాపారంలోకి మళ్లించడంతోపాటు మల్లారెడ్డి-నారాయణ ఆసుపత్రి కోసం వెచ్చిస్తున్నట్టు,. స్థిరాస్తులను కూడా వాస్తవ విలువకు తక్కువగా చూపించారని తెలిసింది. మల్లారెడ్డికి చెందిన 14 విద్యాసంస్థల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు. ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీల బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు.
మల్లారెడ్డికి 38 ఇంజనీరింగ్‌ కాలేజీలు, నాలుగు మెడికల్‌ కాలేజీలు, యూనివర్సిటీతోపాటు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్న నేపథ్యంలో వాటి కొనుగోలుకు సంబంధించిన వివరాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బంధువులు గత మూడేళ్లలో కొనుగోలు చేసిన భూములు, ఆస్తులు, వాటికి డబ్బును ఎక్కడెక్కడి నుంచి చెల్లించారు? అన్న విషయాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. 
 
ఇక మల్లారెడ్డి మెడికల్‌ కాలేజీల్లో సీట్ల కేటాయింపులోనూ అవకతవకలు చోటుచేసుకున్నట్లు, చాలా సీట్లను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో మెడికల్‌ కాలేజీల బ్యాంకు లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.