ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28 శాతం జీఎస్ కమిటీ సిఫార్సు

ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ విధించాలని ఆర్ధిక మంత్రుల కమిటీ మరోసారి సిఫార్సు చేసింది. నైపుణ్యంతో కూడిన ఆటైనా, ఛాన్స్‌మీద ఆధారపడే గేమ్‌ అయినా గరిష్టింగా జీఎస్టీ విధించాలని మంత్రుల కమిటీ ప్రతిపాదించినట్లు తెల్సింది. జీఎస్టీ లెక్కింపు విధానంలోనూ కొన్ని మార్పులు చేసినట్లు తెల్సింది.
మంత్రుల కమిటీ నివేదిక సిద్ధమైందని, త్వరలోనే జీఎస్టీ కౌన్సిల్‌కు సమర్పించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 
ఆన్‌లైన్‌ గేమింగ్‌పై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌లో పాల్గొనే ఆటగాడు చెల్లించే ప్రవేశ రుసుం సహా పూర్తి విలువపై జీఎస్టీ వర్తిస్తుంది.  జీఎస్టీని 28 శాతం పెంచాలని జూన్‌లో మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని మంత్రుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ నివేదికను మరోసారి సమీక్షించాలని జీఎస్టీ కౌన్సిల్‌ మంత్రుల కమిటీకి సూచించింది.
దీంతో అటార్నీ జనరల్‌తో పాటు, ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఇండస్రీకి చెందిన భాగస్వామ్య పక్షాల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అందుకు అనుగుణంగా తుది నివేదిక సిద్ధం చేశారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ను గేమ్స్‌ ఆఫ్‌ స్కిల్‌, గేమ్స్‌ ఆఫ్‌ ఛాన్స్‌గా మంత్రుల కమిటీ వర్గీకరించింది. ఈ రెండు రకాల గేమింగ్స్‌పైనా 28 శాతం జీ ఎస్టీ విధించాలని నివేదికలో పేర్కొంది. లెక్కింపు విషయంలో కొంత ఊరట కల్పించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రూ. 13,600 కోట్లుగా ఉన్న గేమింగ్‌ మార్కెట్‌ 2024-25 నాటికి రూ. 29 వేల కోట్లకు చేరుతుందని నివేదిక అంచనా వేసింది.

కమ్యూనికేషన్‌ ఓటీటీలకు లైసెన్స్‌

కాగా, వాట్సాప్‌, సిగ్నల్‌, టెలిగ్రామ్‌ వంటి కమ్యూనికేషన్‌ ఓటీటీలకూ లైసెన్స్‌ ఉండాలని టెలికం ఆపరేటర్ల సంఘం ( సీఓఏఐ-కాయ్‌) ప్రభుత్వాన్ని కోరింది. ఆయా కమ్యూనికేషన్‌ సర్వీసులు టెలికం కంపెనీలకు పరిహారం చెల్లించేలా నిబంధనలు ఉండాలని ప్రభుత్వాన్ని విజ్జప్తి చేసింది.  ఈ మేరకు టెలికం ముసాయిదా బిల్లు రూపకల్పనలో భాగంగా ఓటీటీ కమ్యూనికేషన్‌ సేవలను ఎలా నిర్వచించాలన్న దానిపై కొన్ని సూచనలు చేసినట్లు కాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌పీ కొచ్చర్‌ తెలిపారు.
 
ఆదాయంలో వాటా పంపకం విషయంలో నిబంధనలు రూపొందించాలని కోరినట్లు తెలిపారు. డేటా వినియోగం ఆధారంగా ఆదాయ పంపకాన్ని భవిష్యత్‌లో అన్ని కేటగిరీల ఓటీటీలకూ దీన్ని వర్తింప చేయాలని కోరినట్లు కొచ్చర్‌ తెలిపారు.