మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌ జైలు భోగాలపై మరో వీడియో

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన‌ మంత్రి సత్యేంద్ర జైన్ కు జైలులో జరుగుతున్న రాజభోగాలు సంబంధించిన మరొక వీడియో బయటికొచ్చింది. కొన్ని రోజుల క్రితం సత్యేంద్ర జైన్ తన కాళ్లకు మసాజ్ చేయించుకుంటున్న వీడియోను విడుదల చేసిన తీహార్ జైల్ అధికారులు తాజాగా ఆయన ఆహారం తీసుకుంటున్న మరో వీడియోను విడుదల చేశారు.

జైన్‌ను మ‌నీల్యాండ‌రింగ్ కేసులో అరెస్టు చేసి తీహార్ జైలులో వేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ జైలులో స‌త్యేంద‌ర్‌కు స‌రైన భోజ‌నం పెట్ట‌డం లేద‌ని ఆయ‌న త‌ర‌పున లాయ‌ర్ కోర్టులో వాదించారు. స‌త్యేంద‌ర్ 28 కేజీల బ‌రువు త‌గ్గిన‌ట్లు ఆ లాయ‌ర్ ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో తీహార్ జైలులో భోజ‌నం చేస్తున్న‌ స‌త్యేంద‌ర్ వీడియోను విడుదల చేశారు.

జైలులో చేరిన త‌ర్వాత స‌త్యేంద‌ర్ 8 కిలోల బ‌రువు పెరిగిన‌ట్లు తీహార్ జైలు అధికారులు వెల్ల‌డించారు. స‌త్యేంద‌ర్ క‌డుపునిండా భోజ‌నం చేస్తున్న జైలులోని సీసీటీవీ ఫూటేజ్ దృశ్యాల‌ను విడుదల చేశారు. సత్యేంద్రజైన్ లాయర్ వాదనలకు, జైలు అధికారులు చెప్పిన దానికి పొంతన లేకపోవడంతో ఈ వీడియోపై మరోసారి వివాదం చెలరేగే అవకాశం ఉంది.

మంత్రి సత్యేందర్‌ జైన్‌ జైలులో వీఐపీ సౌకర్యాలు పొందుతున్నారని ఇటీవ‌ల ఈడీ ఆరోపించిన విష‌యం తెలిసిందే. జైలులో ఆయన మసాజ్‌ పొందుతున్నారని, బిస్లరీ నీరు తాగుతున్నారని పేర్కొన్న‌ది. ఆ ఆరోప‌ణ‌ల‌కు చెందిన మ‌సాజ్ వీడియోను కూడా ఇటీవ‌ల రిలీజ్ చేశారు. సెప్టెంబర్‌ 13, 14 తేదీల్లో రికార్డు చేసిన రెండు వీడియో క్లిప్‌లను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అవి వైరల్‌ అయ్యాయి.

ఈ వీడియోపై మండిపడుతున్నారు బిజెపి నేతలు. సత్యేంద్రజైన్ కు జైల్లో రాచమర్యాదలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మంత్రి జైన్ బయటి నుంచి వచ్చిన విలాసవంతమైన భోజనం చేస్తున్న వీడియోను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా బుధవారం విడుదల చేశారు.

“రేపిస్టు ఖైదీతో మసాజ్ చేయించుకోవడమే కాకుండా రిసార్ట్ లో ఉన్నట్లు సత్యేంద్ర జైన్ కు విలాసవంతమైన భోజనం అందించారు’’ అని జైలు వీడియోను విడుదల చేస్తూ షెహజాద్ ట్వీట్ చేశారు. సలాడ్ లు, రుచికరమైన, పోషక విలువలున్న భోజనంతోపాటు వాటర్ బాటిళ్లు కూడా జైన్ వద్ద ఉన్నట్లు వీడియోలో కనిపించాయి.

 తీహార్ జైలులో ఫ్రూట్-సలాడ్ డైట్‌ను కోరుతూ ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ చేసిన విజ్ఞప్తిపై రూస్ అవెన్యూ కోర్టు తీహార్ జైలు అధికారుల నుంచి స్పందన కోరిన ఒక రోజు తర్వాత ఈ వీడియో బయటపడింది.