జైలులో మసాజ్‌ చేసింది ఫిజియోథెరపిస్ట్‌ కాదు .. రేప్ నిందితుడు

తీహార్ జైలులో ఉన్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ మసాజ్ వీడియోపై రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంలో తాజాగా ఊహించని ట్విస్ట్ బయటపడింది. సత్యేందర్ జైన్ కు మసాజ్ చేసిన వ్యక్తి ఫిజియో థెరపిస్ట్ కాదని.. రేప్ కేసులో నిందితుడన్న విషయం వెలుగులోకి వచ్చింది. 
 
దీంతో వైద్యుల సూచన మేరకు ఫిజియోథెరపీ తీసుకుంటున్నారన్న ఆమ్ ఆద్మీ పార్టీ మాటల్లో నిజం లేదని తేలిపోయింది.  సత్యేందర్ జైన్ కు మసాజ్ చేసిన వ్యక్తి తీహార్ జైలులో పోక్సో చట్టం కింద శిక్ష అనుభవిస్తున్న రింకూ అనే ఖైదీ అని జైలు అధికారులు గుర్తించారు.
అతను పోక్సోతో పాటు ఐపీసీ 376, 506, 509 సెక్షన్ల కింద అభియోగాలు ఎదుర్కొంటున్న చెప్పారు. జైలు అధికారుల ప్రకటనతో మంత్రి సత్యేందర్ సహచర ఖైదీలతో మసాజ్ చేయించుకున్నారన్న విషయం వెల్లడైంది. అయితే తీహార్ జైలు అధికారులు మాత్రం ఈ విషాన్ని బహిరంగంగా చెప్పేందుకు నిరాకరిస్తున్నారు.
మరో వైపు సత్యేందర్‌ జైన్‌కు మసాజ్‌ చేసింది రేపిస్ట్‌ అని బీజేపీ నేత షాజాద్‌ పూనావాలా ట్వీట్‌ చేశారు. అతను ఫిజియోథెరపిస్ట్‌ కాదని, రేపిస్ట్‌ అని ఆరోపించారు. వారు నిజంగా తీహార్‌ను థాయ్‌లాండ్‌గా మార్చారని ఎద్దేవా చేశారు.   సత్యేందర్‌ జైన్‌ను బర్తరఫ్‌ చేయాలని, అవినీతిని సమర్థించడం ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. 

మరో వైపు కాంగ్రెస్‌ నేత అల్కా లాంబ ఆప్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. అమ్మాయిలపై లైంగిక దాడి చేసే వారితో సేవలు చేయించుకుంటున్నారని, ఆ తర్వాత వారిని రక్షిస్తారని ఆరోపించారు.ఇదిలా ఉండగా.. తీహార్‌ జైలులో సత్యేందర్‌ జైన్‌ బ్యారక్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఫుటేజీలో ఓ వ్యక్తి సత్యేందర్‌ జైన్‌ పాదాలకు మసాజ్‌ చేస్తూ కనిపించాడు. ఈ ఫుటేజీని ఈడీ కోర్టుకు సైతం అందించింది.  సత్యేందర్‌ జైన్‌ తీహార్‌లోని ఏడో నెంబర్‌ జైలులో ఉన్నారు. జైన్‌కు సౌకర్యాలు కల్పించినందుకు జైలు సూపరింటెండెంట్‌తో సహా నలుగురు జైలు అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేశారు.

అదే సమయంలో 35 మందికిపైగా జైలు అధికారులు, సిబ్బంది మార్చారు.  మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సత్యేందర్‌ జైన్‌ను ఈడీ మే 30న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనపై కేసు నమోదు చేసింది. అంతకు ముందు ఏప్రిల్‌లో జైన్‌ కుటుంబానికి చెందిన రూ.4.81కోట్ల విలువైన స్థిరాలను జప్తు చేసింది.