పరిహార నిధి ఏర్పాటు ఒప్పందంపై భారత్ హర్షం 

ఈజిప్టులో తాజాగా జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు 27లో పర్యావరణ మార్పుల కారణంగా తలెత్తే విపత్తుల వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయడానికి ఒక నిధిని ఏర్పాటు చేయడంపై ఒప్పందం కుదరడం చరిత్రాత్మకంగా భారత్ అభివర్ణించింది. దీనికోసం ప్రపంచం దీర్ఘకాలం వేచి చూసిందని వ్యాఖ్యానించింది
 
 ఒప్పందం కుదరడాన్ని చారిత్మ్రకంగా కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌ వర్ణించారు. పరిహార నిధి ఏర్పాటు చేయడానికి ఏకాభిప్రాయాన్ని తీసుకునిరావడంలో అవిశ్రాంత ప్రయత్నం చేస్తున్న ఈజిప్టు కృషిని మంత్రి అభినందించారు. ‘కాప్ 27’ సదస్సు ముగింపు ప్లీనరీలో భూపేంద్ర సింగ్ యాదవ్ జోక్యం చేసుకుంటూ అయితే కర్బన ఉద్గారాలు, గ్రీన్‌హౌస్ వాయువుల తగ్గింపు బాధ్యతల భారం రైతులపై పడకుండా చూడాలని హితవు చెప్పారు.
 
 సదస్సులో వ్యవసాయం, ఆహార భద్రత రంగాల్లో వాతావరణ కార్యాచరణపై నాలుగేళ్ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని మంత్రి ప్రస్తావిస్తూ పర్యావరణ మార్పుల కారణంగా లక్షలాది మంది సన్నకారు రైతుల జీవితాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అందువల్ల ఈ సమస్యను ఎదుర్కొనే భారాన్ని వారిపైపడకుండా చూడాలని స్పష్టం చేశారు.