ఇండోనేషియాలో భారీ భూకంపం..46 మంది దుర్మరణం

ఇండోనేషియాలో భారీ భూకంపం  ప్రజలను వణికించింది. జావా ద్వీపంలో సోమవారం మధ్యాహ్నం భూమి ఒక్కసారిగా కంపించింది. దీనితో ప్రజలు ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో 46 మంది మృతి చెందగా, 300 మందికి పైగా ప్రజలు గాయపడినట్లు అధికారులు తెలిపారు. 
 
రిక్టర్‌ స్కేల్‌పై 5.6 తీవ్రతతో జకార్తాలో భూకంపం సంభవించిందని జియోఫిజిక్స్‌ ఏజెన్సీ పేర్కొంది. పశ్చిమ జావాలోని సియాంజూర్‌లో భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది. భారీ ప్రకంపలతో కార్యాలయాల్లో నుంచి ఉద్యోగులు, ఇండ్ల నుంచి జనం బయటకు పరుగులు పెట్టారు. 
 
ఇదిలా ఉండగా, పశ్చిమ ఇండోనేషియాలో గత శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించగా భూకంప తీవ్రత 6.9గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే, తీవ్రంగానే ప్రకంపనలు వచ్చినా ఎలాంటి నష్టం జరుగకపోవడం విశేషం.  కానీ,  ఇవాళ 5.6 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
 
గతంలో జపాన్‌, ఇండొనేసియాలో తరచూ భూకంపాలు  వచ్చేవి. కానీ రాను రాను జపాన్‌లో అవి తగ్గినా, ఇండొనేసియాలో మాత్రం తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇండోనేషియా దేశ జనాభా 27 కోట్ల మందికి పైగా ఉన్నారు. భూకంపం వచ్చినప్పుడల్లా వారు ఉలిక్కి పడుతున్నారు. 
 
అక్కడే భూకంపాలు రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఈ భూమిపై రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఒకటి ఉంది. ఆ రింగ్ ఉన్న ప్రాంతంలో ఎక్కువగా అగ్నిపర్వతాలు ఉన్నాయి. అదే రింగ్ లో ఇండొనేసియా కూడా ఉంది. ఇక రెండో కారణంగా అగ్నిపర్వతాన్ని చెబుతారు. 
 
ఇండొనేసియా మొత్తం ఓ భారీ అగ్ని పర్వతంపై ఉంది. భూమిలోపల ఉన్న ఆ అగ్ని పర్వతం యాక్టివ్‌గా ఉంది. దాని నుంచి వచ్చే అతి తీవ్ర ఒత్తిడి వల్ల అక్కడి భూ పలకాలు కదులుతున్నాయి. ఫలితంగానే భూకంపాలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.