ఇకపై సెల్‌ఫోన్‌లోనే లైవ్ టీవీ ప్రసారాలు!

దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతూ ఉండడంతో రాను రాను టీవీ చూసే వారి సంఖ్య తగ్గిపోతున్నది. స్మార్ట్ ఫోన్‌ తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. కాలక్షేపం, వినోదం  కోసం స్మార్ట్ ఫోన్ లనే  వినియోగిస్తున్నారు. సినిమాలు చూడాలన్నా, పాటలు వినాలన్నా, వార్తలు వీక్షించాలన్నా.. అన్నీ ఫోన్‌లోనే జరిగిపోతున్నాయి. 
 
టివి ఛానెళ్లను కూడా టివి లోనే చూస్తున్నారు. ఐతే మొబైల్ ఫోన్‌లో లైవ్ టీవీ చూడాలంటే ఇంటర్నెట్ ఉండాలి. సబ్‌స్క్రిప్షన్  చేసుకోవాలి. కానీ ఇకపై ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా, సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండా  మొబైల్ ఫోన్లలోనే లైవ్ ప్రసారాలు చూడవచ్చు. ఆ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. 
 
ఈ టెక్నాలజీ పేరు డి2ఎం  (డైరెక్ట్ టు మొబైల్). ఇది డి2హెచ్ (డైరెక్ట్ టు హోమ్‌)ని పోలి ఉంటుంది. భారత టెలి కమ్యూనికేషన్స్ విభాగం ఐఐటీ కాన్పూర్‌, ప్రసార భారతిలతో కలిసి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది.  డైరెక్ట్‌ టు మొబైల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌‌పై త్వరలోనే దేశ రాజధాని ప్రాంతం (ఢిల్లీ ఎన్ సి ఆర్)లో పైలట్‌ ప్రాజెక్టు చేపడతామని కేంద్రం వెల్లడించింది. 
 
 టెలివిజన్‌ సర్వీసులు నేరుగా మొబైల్‌లో వచ్చేలా దీన్ని చేపట్టనున్నట్టు  కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర పేర్కొన్నారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ నిర్వహించిన బిగ్‌ పిక్చర్‌ సదస్సులో పాల్గొన్న ఆయన ఇంటర్నెట్ అవసర లేకుండానే మొబైల్  ఫోన్లలో టీవీ చూడవచ్చని తెలిపారు.  బ్రాడ్‌కాస్ట్, బ్రాడ్‌బ్యాండ్ సాంకేతికతలను కలిపి మొబైల్  ఫోన్లలోనే డిజిటల్ టీవీ ప్రసారాలు జరుగుతాయని వెల్లడించారు.
 
ఐఐటీ కాన్పూర్, సంఖ్యాల్యాబ్స్ కలిసి ఇప్పటికే బెంగళూరులో దీనిపై అధ్యయనం చేశాయి. ప్రస్తుతం దేశంలో 20 కోట్ల టీవీలే ఉన్నాయి. కానీ  60 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్‌, 80 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులు ఉన్నారు.  అందువల్ల ఈ టెక్నాలజీతో టీవీ సర్వీసులు ప్రజలకు మరింత చేరవవుతాయని కేంద్రం తెలిపింది.   డీ2ఎం కూడా ఎఫ్ఎం రేడియోలానే ఉంటుంది. 
 
రేడియో ఫ్రీక్వెన్సీని అందుకొని ఎఫ్ఎం ఎలా పనిచేస్తుందో  మొబైల్ ఫోన్‌లో టీవీ కూడా అలానే పనిచేస్తుంది.  అత్యవసర హెచ్చరికలు జారీ చేయడం, ప్రకృతి వైపరీత్యాలను అరికట్టడంతో పాటు నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేసేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని కేంద్రం తెలిపింది.   ఇంటర్నెట్‌ అందుబాటులో లేని సుదూర ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంది. ఈ టెక్నాలజీ వల్ల బ్యాండ్‌విడ్త్‌పై ఒత్తిడి తగ్గి కాల్ డ్రాప్స్ కూడా తగ్గుతాయి. డేటా వేగం కూడా పెరుగుతుందట.