మంగళూరులో ఆటో రిక్షా దగ్ధం ఓ ఉగ్రవాద చర్య!

కర్ణాటకలోని మంగళూరులో శనివారం ఓ ఆటోలో ప్రేలుడు సంభవించి దగ్ధమైన సంఘటనకు కారణం ఉగ్రవాద చర్యేనని రాష్ట్ర డీజీపీ ప్రవీణ్ సూద్  ప్రకటించారు. ఇది ప్రమాదం కాదని నిర్థరణ అయినట్లు తెలిపారు. ఈ సంఘటనలో ఆటో రిక్షా డ్రైవర్, ఓ ప్రయాణికుడు కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు.
డీజీపీ సూద్ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ఇప్పుడు ధ్రువపడింది. ఈ పేలుడు ప్రమాదం కాదు, పెద్ద ఎత్తున నష్టం కలిగించాలనే ఉద్దేశంతో జరిగిన ఉగ్రవాద చర్య’’ అని తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో కలిసి కర్ణాటక పోలీసులు ఈ సంఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని క‌ర్నాట‌క హోం మంత్రి జ్ఞానేంద్ర తెలిపారు.
మంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగూరి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు శనివారం ఈ ఆటో రిక్షా వచ్చేసరికి పేలుడు సంభవించింది. ముక్కలైన కుక్కర్ ఈ ఆటో రిక్షాలో కనిపించింది. ఆటో డ్రైవర్, ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరు కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వీరు మాట్లాడలేకపోతున్నారని సిటీ పోలీస్ కమిషనర్ శశి కుమార్ చెప్పారు. వదంతులను నమ్మవద్దని ప్రజలను కోరారు. ప్రయాణికుడి వద్ద ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్ నుంచి మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ బ్యాగ్‌లో ఏముందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
సంఘటన స్థలం నుంచి కొన్ని నమూనాలను ఫోరెన్సిక్ బృందం సేకరించింది. సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.