ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఢిల్లీ పెద్దలకు రూ.100 కోట్ల ముడుపులు!

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఢిల్లీ పెద్దలకు రూ.100 కోట్ల ముడుపులు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక నిందితుడు  విజయ్ నాయర్ రేమండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.  ఢిల్లీ పెద్దలకు రూ.100 కోట్ల ముందస్తు ముడుపులు ఇచ్చింది విజయ్‌నాయరే అని ఈడీ స్పష్టం చేసింది. 
 
ఆప్ మంత్రి కైలాష్‌ గెహ్లాట్ నివాసంలోనే విజయ్‌నాయర్ బస చేశారని, ఢిల్లీ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఓఎస్డీగా అధికారులకు విజయ్‌నాయర్‌ పరిచయం చేసుకున్నారని ఈడీ తెలిపింది. ఆప్ మీడియా సెల్ ఇన్‌చార్జ్‌గా ఉన్న విజయ్‌నాయర్ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని ఈడీ స్పష్టం చేసింది. 
 
హోల్ సేల్ అమ్మకందారుల నుంచి డబ్బు వసూలు చేసి ప్రభుత్వ పెద్దలకు ఇచ్చారని వివరించింది. ఈ  రూ. 100 కోట్ల ముడుపుల్లో రూ.30 కోట్లను అభిషేక్ బోయిన్ పల్లి హైదరాబాద్ నుంచి హవాలా మార్గంలో దేశ రాజధానికి తరలించాడని పేర్కొంది.
 
కాగా, విజయ్ నాయర్ తనను తాను ఢిల్లీ ఎక్సైజ్ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకున్నాడని ఈడీ త‌న రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. మద్యం పాలసీని తమవారికి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడని తెలిపింది. మద్యం పాలసీ, తయారీకి రెండు నెలల ముందే విజయ్ నాయర్ చేతుల్లోకి వచ్చేసిందని, దాన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన‌ట్టు ఈడీ పేర్కొంది.
 
మరోవంక, లిక్కర్ స్కామ్‌లో నిందితులు విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్ పల్లి కస్టడీని కోర్టు పొడిగించింది. ఈడీ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ ప్రత్యేక కోర్టు వారిద్దరి కస్టడీని మరో ఐదు రోజుల పాటు పొడిగిస్తున్నట్టు ఇవ్వాల (శనివారం) తెలిపింది. ఈడీ తొమ్మిది రోజుల కస్టడీ కోరగా, న్యాయస్థానం ఐదు రోజులే మంజూరు చేసింది.
ఇలా ఉండగా, లిక్కర్ స్కామ్‌ కేసులో కనికారెడ్డిని ఈడీ ప్రశ్నించింది. కనకారెడ్డి విమానాల్లో నగదు తరలించారని అభియోగాలు ఉన్నాయి. దాదాపు గంటకుపైగా కనికారెడ్డిని ప్రశ్నించినట్లు ఈడీ తెలిపింది.  జెట్ సెట్ గో ఆపరేషన్స్, కంపెనీ వివరాలను ఈడీ అధికారులకు కనికా రెడ్డి అందజేసినట్లు సమాచారం అందింది. కనికా రెడ్డిని మరోసారి విచారించే అవకాశం ఉందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె, ఈ కేసులో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి భార్య.
లిక్కర్ స్కాంకు సంబంధించి శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు కస్టడీని కోర్టు ఇప్పటికే ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించింది. మరోవైపు విచారణలో భాగంగా ఈడీ అధికారులు శుక్రవారం రాబిన్ డిస్ట్రిలరీస్ డైరెక్టర్ అరుణ్ రామచంద్ర పిళ్లై, చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును ప్రశ్నించారు. 
 
సౌత్ లాబీ గ్రూప్ నుంచి ఢిల్లీకి అక్రమంగా తరలించిన డబ్బుపై వీరిని ప్రశ్నించినట్లు సమాచారం. సౌత్ గ్రూప్ నుంచి వందల కోట్ల రూపాయలు ఢిల్లీకి తరలించారని ఈడీ మొదటి నుంచి అనుమానిస్తోంది.