వ్యక్తిగత డేటా నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.500 కోట్ల వరకు జరిమానా

వ్యక్తిగత సమాచారానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. వ్యక్తిగత సమాచార భద్రతకు సంబంధించి ఉల్లంఘనలకు.. గతంలో ప్రతిపాదించిన జరిమానా మొత్తాన్ని రూ.15 కోట్ల నుంచి రూ.500 కోట్ల దాకా పెంచుతూ కేంద్రం తాజా ప్రతిపాదన చేసింది. 
 
పెద్ద టెక్నాలజీ కంపెనీలను అప్రమత్తం చేసిన గత బిల్లును ఉపసంహరించుకున్న మూడు నెలల తరువాత కొత్త డిజిటల్‌ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు ముసాయిదాను శుక్రవారం విడుదల చేసింది.  తాజాగా ‘డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్‌ 2022’ పేరిట రూపొందించిన ముసాయిదా బిల్లులో.. ఏ వ్యక్తి/సంస్థ అయినా గణనీయమైన ఉల్లంఘనలకు పాల్పడితే భారిగా జరిమానా విధించే ప్రతిపాదన చేసింది. 
 
కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ఈ బిల్లు ముసాయిదా ప్రతిని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీనిపై అభిప్రాయాలు, అభ్యంతరాల వెల్లడికి కేంద్రం డిసెంబరు 17 దాకా గడువు ఇచ్చింది. ప్రజల సంప్రదింపుల అనంతరం వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. 
 
ముసాయిదా బిల్లులోని నిబంధనల ప్రకారం విధులను కొనసాగించే డేటా ప్రొటెక్షన్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ నిబంధనలను ఓ వ్యక్తి ఉల్లంఘించినట్లు దర్యాప్తు అనంతరం ఈ బోర్డు నిర్ధారణకు వస్తే, ఆ వ్యక్తి తన వాదనలను వినిపించేందుకు తగిన అవకాశాన్ని కల్పించాలని ప్రతిపాదించింది. 
 
ఆ వాదనలను విన్న తర్వాత ఈ బిల్లులోని ఒకటో షెడ్యూలులో నిర్దేశించిన విధంగా జరిమానాను విధించవచ్చునని పేర్కొంది. డేటా ఫిదుసియరీ, డేటా ప్రాసెసర్‌ తన నియంత్రణలో ఉను, తన స్వాధీనంలో ఉను పర్సనల్‌ డేటాను పరిరక్షించడంలో విఫలమైతే రూ.250 కోట్ల వరకు జరిమానా విధించవచ్చునని ఈ బిల్లు ప్రతిపాదించింది.
 
 ఒరిజినల్‌ డ్రాఫ్ట్‌ను పరిశీలించిన జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ 91 సెక్షన్ల బిల్లుకు 88 సవరణలను సూచించిందని, దీంతో అసలు బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవడం తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర టెలికాం, ఐటి శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.
 
దేశ పౌరులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని చట్టపరమైన దర్యాప్తుల నిమిత్తం, ప్రాసిక్యూషన్‌ తదితర నిర్ణీత సందర్భాల్లో విదేశాలకు బదిలీ చేయొచ్చు. అయితే, అలా బదిలీ చేయొచ్చా లేదా నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమే. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సంస్థలు చట్టబద్ధంగా, పారదర్శక విధానంలో మాత్రమే, అదీ, ఆ సమాచారాన్ని ఎందుకు సేకరిస్తున్నాయో ఆ పనికి మాత్రమే ఉపయోగించాలి.