పాక్ మహిళ హనీ ట్రాప్‌లో విదేశాంగ శాఖ డ్రైవర్!

విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన డ్రైవర్‌ గూఢచర్యానికి పాల్పడ్డాడు. పాకిస్థాన్‌ మహిళ హనీ ట్రాప్‌లో పడిన అతడు కీలక సమాచార పత్రాలను ఆమెకు అందజేశాడు. దీనికి గాను డబ్బులు కూడా పొందాడు. ఈ విషయం తెలియడంతో ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఆ డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్న ఒక వ్యక్తి హనీ ట్రాప్‌లో పడ్డాడు. పాకిస్థాన్‌కు చెందిన ఒక మహిళ పూనం శర్మ అలియాస్‌ పూజ పేరుతో అతడితో పరిచయం పెంచుకుంది. డబ్బులు ఆశపెట్టి ఆ శాఖకు చెందిన కీలక సమాచారం, పత్రాలను ఆ డ్రైవర్‌ నుంచి ఆమె పొందుతున్నది.
కాగా, ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు ఈ విషయం తెలిసింది. దీంతో దీనిపై నిఘా ఉంచి దర్యాప్తు జరిపారు. పాకిస్థాన్‌ మహిళకు కీలక సమాచారం, పత్రాలు అందజేస్తున్న విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన కారు డ్రైవర్‌ను జవహర్ లాల్ నెహ్రూ భవన్‌ వద్ద శుక్రవారం అరెస్ట్‌ చేశారు. హనీ ట్రాప్‌కు గురైన అతడు గూఢచర్యానికి పాల్పడినట్లు పోలీసులు ఆరోపించారు. దీనిపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.
ఇదిలావుండగా, రాజస్థాన్ పోలీసులు ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీలో భాగ్‌చంద్ (46) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి 1998లో ఢిల్లీకి వచ్చారు. 2016లో మన దేశ పౌరసత్వాన్ని పొందారు. అయితే ఆయన పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు పోలీసులు ఆరోపించారు.