తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్‌-ఎస్‌ ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్షయాన రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ మరో చరిత్రాత్మక ప్రయోగానికి వేదికైంది. దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ ను ప్రయోగించారు.  ప్రైవేట్ సంస్థ అభివృద్ది చేసిన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
హైదరాబాదుకు చెందిన స్కైరూట్ సంస్థ రూపొందించిన విక్రమ్-ఎస్ రాకెట్‌ను  తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్ షార్‌ నుంచి శుక్రవారం ప్రయోగించారు.  ఉదయం 11.30 గంటలకు విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ నింగిలోకి వెళ్లింది.  విక్రమ్‌ సారాభాయ్‌ పేరుమీద దీనికి విక్రమ్‌-ఎస్‌ అని నామరకణం చేశారు. దీని పొడవు 6 మీటర్లు కాగా, బరువు 545 కిలోలు.
 
ఇది రెండు భారతీయ, ఒక విదేశీ పేలోడ్లను కక్షలోకి తీసుకెళ్లింది. వాటిలో భారత్, అమెరికా, సింగపూర్, ఇండోనేషియాకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేసిన 2.5 కిలోల పేలోడ్ అయిన ఫన్-శాట్‌, చెన్నైకి చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ స్పేస్ కిడ్జ్‌ ఉన్నాయి. ఈ మిషన్ ద్వారా దేశంలో అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించిన తొలి ప్రైవేట్ అంతరిక్ష సంస్థగా స్కైరూట్ అవతరించింది. 
భూ ఉపరితలం నుంచి 103 కిలోమీటర్ల ఎత్తులోని నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఉపగ్రహం భూమి మీద బంగాళాఖాతం సముద్రం వరకు తీసుకువచ్చేలా రూపకల్పన చేశారు.  భూమిపైకి తిరిగి వచ్చే సమయంలో గాలిలో తేమ, వాతావరణ పరిస్థితులు, తిరుగు ప్రయాణంలో వేగం వంటివి అంచనా వేయనున్నారు. స్కైరూట్‌ ఏరో స్పేస్‌ సంస్థను మాజీ శాస్త్రవేత్తలు ప్రారంభించారు. డా.విక్రమ్‌ సారాభాయ్‌కి నివాళిగా స్కైరూట్‌ ఆయన పేరు పెట్టింది.
ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్‌ మాట్లాడుతూ తొలి మిషన్‌కు ‘ప్రారంభ్‌’ అని నామకరణం చేసినట్లు తెలిపారు. విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రైవేట్ రాకెట్ ప్రయోగాల్లో ఇది ఆరంభమేనని సోమ్‌నాథ్‌ చెప్పారు. మన అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త అధ్యాయానికి నాంది అని కేంద్ర మంత్రి జితేంద్ర తెలిపారు.