మతం మారిన వారికి ‘ఎస్సీ’ హోదా వర్తించకూడదు

క్రైస్తవం, ఇస్లాంలోకి మతాంతీకరణ చెందిన వారికి ‘షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టేటస్, ప్రయోజనాలు’ ఇవ్వకూడదు, ఎందుకంటే క్రైస్తవం, ఇస్లాంలో అణచివేత, వెనుకబాటుతనం అనేవి ఉండవని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. 
 
ప్రభుత్వేతర సంస్థ ‘సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్’(సిపిఐఎల్) దాఖలు చేసిన వినతికి ప్రతిస్పందనగా కేంద్రం సుప్రీంకోర్టు ముందు ఈ వాదన వినిపించింది. ఆ సంస్థ ఇస్లాం, క్రైస్తవ మతం స్వీకరించిన దళితులకు కూడా రిజర్వేషన్, ఇతర ప్రయోజనాలు దక్కాలని కోరింది.

“వాస్తవానికి షెడ్యూల్డ్ కాస్ట్ ప్రజలు అంటరానితనం, అణచివేత విధానాల నుంచి వెలికి రావడానికే ఇస్లాం, క్రైస్తవ మతాలను స్వీకరిస్తున్నారు. అంటరానితనం, అణచివేత ఆ మతాల్లో లేవు” అని అఫిడవిట్‌లో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే బౌద్ధం స్వీకరించిన దళితుల విషయంలో ప్రభుత్వం సానుకూలత చూపింది. 
 
 1956లో డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన పిలుపు మేరకే షెడ్యూల్డ్ క్యాస్ట్ వారు బౌద్ధ మతాన్ని స్వీకరించారని ప్రభుత్వం వివరించింది. ఆ మతాంతీకరణ కులం/సమూహంను ఖచ్చితంగా నిర్ధారించలేమని పేర్కొంది.  ఇది ఇస్లాం, క్రైస్తవాలకు వర్తించదని స్పష్టం చేసింది. ఇస్లాం, క్రైస్తవ మతాలు వేరే ఉద్దేశ్యాలతోనే మతాంతీకరణకు పాల్పడుతున్నాయని, అవి కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్నాయని పేర్కొంది.