సౌర, పవన, చిన్న హైడ్ విద్యుత్ ప్రాజెక్టులకు గ్రీన్‌ బాండ్లు

మొదటిసారిగా సౌరవిద్యుత్‌ ప్రాజెక్టులతో పాటు పవన, చిన్న హైడ్రో ప్రాజెక్టులకు గ్రీన్‌ బాండ్ల (పర్యావరణ పరిరక్షణ కోసం పెట్టుబడులు) ద్వారా నిధులు సమకూర్చడంపై భారత్‌ దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టుల కోసం రూ. 160 బిలియన్‌ మేర బాండ్లను అక్టోబర్‌ -మార్చి మధ్య జారీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
 
2022-23 బడ్జెట్‌లో ఈ బాండ్లను జారీ చేసే ప్రణాళికను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. చీఫ్‌ ఎకనామిక్‌ ఎడ్వైజర్‌ వి.అనంత నాగేశ్వరన్‌ నేతృత్వంలోని గ్రీన్‌ ఫైనాన్స్‌ వర్కింగ్‌ కమిటీ వివిధ ప్రభుత్వ విభాగాలు సమర్పించిన వాటిలో ప్రభుత్వ రంగ ప్రాజెక్టులను ఎంపిక చేయనుందని ప్రభుత్వం తెలిపింది.
 
ప్రాజెక్టుల ఎంపిక కోసం పర్యావరణ నిపుణులు, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ ప్రతినిధులు కమిటీకి మార్గనిర్దేశం చేస్తారని ప్రభుత్వం పేర్కొంది. ఈ కమిటీ ఏటా గ్రీన్‌ బాండ్ల ద్వారా నిధులు సమకూర్చే తాజా ప్రాజెక్టులను గుర్తిస్తుందని తెలిపింది.
 
 బాండ్‌ల నుండి వచ్చే ఆదాయాన్ని జారీ చేసిన తేదీ నుండి 24 నెలల్లోపు కేటాయించబడుతుందని ప్యానెల్‌ నిర్థారిస్తుందని పేర్కొంది. అయితే, గ్రీన్‌ బాండ్ల ద్వారా వచ్చే ఆదాయం 25 మెగా వాట్ల కంటే పెద్ద జలవిద్యుత్‌ ప్లాంట్లకు, అణు ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు వినియోగించబడదని ప్రభుత్వం ప్రకటించింది.
 
అయితే ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం దేశీయ రుణ మార్కెట్‌ను దెబ్బతీసేందుకు యత్నిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.