నీరవ్ మోదీని అప్పగించేందుకు లండన్ కోర్టు అంగీకారం

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్ కు అప్పగించేందుకు లండన్ కోర్టు అంగీకారం తెలిపింది. తన మానసిక ఆరోగ్య కారణాలతో భారత్కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన అప్పీల్‌ను బుధవారం కోర్టు కొట్టేసింది. 
 
మోసం, డబ్బు ఆరోపణలను ఎదుర్కొనేందుకు అతన్ని భారత్కు అప్పగించడం అన్యాయం, అణచివేత కాదని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లార్డ్ జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్, జస్టిస్ రాబర్ట్ జే ఈ ఏడాది ప్రారంభంలో రాయల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో అప్పీల్ విచారణకు అధ్యక్షత వహించారు.  
 
51 ఏళ్ల మోదీ మానసిక స్థితి కారణంగా ఆయనను అప్పగించడం సాధ్యం కాదని అతని తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కాగా, వారి వాదనలు వినడానికి యూరోపియన్ మానవ హక్కుల కన్వెన్షన్ లోని ఆర్టికల్ 3 కింద హైకోర్టులో అప్పీల్ చేయడానికి రెండు కారణాలపై అనుమతి మంజూరు చేశారు. 
 
నేరస్థుల అప్పగింత చట్టం 2003లోని సెక్షన్ 91, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై కోర్టు విచారణ జరిపింది. యుకె కోర్టులలోని అన్ని మార్గాలు అయిపోయిన తర్వాత వజ్రాల వ్యాపారి ఇప్పటికీ యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్  నుండి రూల్ 39 అని పిలవబడే నిషేధాన్ని కోరే చాన్స్ ఉందని తెలుస్తోంది.
 
అందువల్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ కుంభకోణం కేసులో 2 బిలియన్ డాలర్ల మోసం, మనీలాండరింగ్ కేసులో అతన్ని తిరిగి భారతదేశానికి తీసుకువచ్చి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంచే ప్రక్రియకు ఇంకా కొంత కాలం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.  
 
హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేసే ఆలోచనలపై అతని న్యాయ బృందం ఇంకా వ్యాఖ్యానించలేదు. ఇంతలో మోదీ 2019 మార్చిలో అరెస్టు అయినప్పటి నుండి నైరుతి లండన్‌లోని వాండ్స్ వర్త్ జైలులో ఉన్నారు.