రామాలయ నిర్మాణం పనులు 2023 చివరికల్లా పూర్తి

అయోధ్యలో రామాలయ నిర్మాణం పనులు 2023 చివరికల్లా పూర్తవుతాయని, ప్రస్తుతం నిర్మాణం పనులు సగానికి పైగా పూర్తయ్యాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన బీజేపీ తొలి తీర్మానం పాలంపూర్‌లోనే ఆమోదించడం జరిగిందని గుర్తుచేశారు.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలంపూర్‌లో బీజేపీ అభ్యర్థి త్రిలోక్ కపూర్ తరఫున యోగి ఆదిత్యనాథ్ మంగళవారంనాడు ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, అయోధ్యలో సగానికి పైగా పూర్తయిన ఆలయ నిర్మాణం 2023 చివరికల్లా పూర్తవుతుందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

500 ఏళ్లుగా ఎదురుచూస్తున్న భవ్య రామాలయ నిర్మాణం కల త్వరలోనే సాకారం కాబోతోందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్టుదల, పటిష్ట నాయకత్వంలో చరిత్రలో గుర్తిండిపోయేలా అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతోందని తెలిపారు.

కాగా, అన్ని నియోజకవర్గంలో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్ధి లోకేంద్ర కుమార్ తరఫున కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రచారం సాగిస్తూ  అంతర్జాతీయంగా భారతదేశం గ్రాఫ్ పెరుగుతోందని, ఈరోజు భారత్ ప్రమేయం లేకుండా ప్రపంచంలో ఏ సమస్య పరిష్కారం కాని స్థితిలో మనం ఉన్నామని స్పష్టం చేశారు.  బ్రిటన్‌ను దాటి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలిచిందని చెప్పారు.

కరోనా మహమ్మారి సమయంలో కోట్లాది మంది పేదలకు ఉచిత రేషన్ ఇచ్చిన ఘనత భారతదేశానికి దక్కుతుందని పేర్కొంటూ పేదలకు బీజేపీ కార్యకర్తలు ఎంతగానో తోడ్పాటు అందించారని, అప్పుడు కాంగ్రెస్‌కు చెందిన బ్రదర్-సిస్టర్ ద్వయం ఎక్కడున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబానికే పరిమితమైతే, భారతదేశ ప్రజలంతా తమ కుటుంబంగా మోదీ-బీజేపీ భావిస్తుంటారని చెప్పారు.

హిమాచల్ ప్రదేశ్ సాహసవీరుల పురిటిగడ్డ అని, ఇక్కడి యువకులు ఎందరో సైన్యంలో ఉన్నారని, ఇవాళ శత్రువులకు మన దేశం వైపు కన్నెత్తి చూసే సాహసం లేదని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. రామాలయ నిర్మాణం, 370వ అధికరణ రద్దు, సర్జికల్ దాడులు వంటి చారిత్రక నిర్ణయాలను కేంద్రం తీసుకుందని, కాంగ్రెస్ హయాంలో అయితే ఇవెంతమాత్రం సాధ్యమయ్యేవి కావని చెప్పారు.

హిమాచల్‌ప్రదేశ్‌లో తిరిగి బీజేపీ గెలిచినట్లయితే డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఇద్దరూ హిమాచల్‌కు చెందిన వారేనని, దీనిని బట్టే రాష్ట్రానికి కేంద్రం ఎంత ప్రాధాన్యం ఇస్తోందో చెప్పవచ్చని గుర్తు చేశారు. కాగా, 68 మంది సభ్యుల హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 12న ఎన్నికలు జరుగనున్నాయి.