రెండు టీవీ ఛానళ్లను `బహిష్కరించిన’ కేరళ గవర్నర్

కేరళ గవర్నర్‌ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ రెండు టీవీ ఛానళ్లను  బహిష్కరించారు. కైరాళీ టీవీ, మీడియా వన్ టీవీతో తాను మాట్లాడబోనని తెలిపారు. ఆయా మీడియా సిబ్బంది తన సమావేశం నుంచి వెళ్లిపోవాలని కోరారు. 

సోమవారం కొచ్చి గెస్ట్‌ హౌస్‌లో గవర్నర్‌ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కైరాళీ టీవీ, మీడియా వన్ టీవీ రిపోర్టర్లను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. ‘నేను మీతో మాట్లాడను. ఈ రెండు ఛానెల్స్‌లలో ఎవరైనా ఉంటే దయచేసి బయటకు వెళ్లండి. లేకపోతే సమావేశం నుంచి నేనే వెళ్లిపోతా. కైరాళీ, మీడియా వన్‌తో మాట్లాడబోనని నేను ఖచ్చితంగా చెప్పాను’ అని  చెప్పారు.

మీడియా చాలా ముఖ్యమైనదిగా తాను భావించానని, ఎప్పుడూ కూడా మీడియాకు ప్రతిస్పందిస్తానని కేరళ గవర్నర్‌ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తెలిపారు. అయితే మీడియాగా ముసుగు వేసుకునే వారిని తాను ఒప్పించలేక పోతున్నానని స్పష్టం చేశారు. ‘వారు మీడియా కాదు. మీడియా ముసుగులో ఉన్న రాజకీయ పార్టీ సభ్యులు’ అని ఆయన విమర్శించారు.

మరోవైపు అక్టోబర్‌ 24న కైరాళీ టీవీ, మీడియా వన్ టీవీతో సహా నాలుగు మలయాళ ఛానెల్స్‌ను రాజ్‌భవన్ నిషేధించింది. గవర్నర్‌ ప్రెస్‌మీట్‌కు హాజరుకావద్దని పేర్కొంది. కాగా, కైరాళీ టీవీ కేరళలోని అధికార సీపీఎం పార్టీకి చెందిన ఛానెల్‌.

అయితే భద్రతా పరమైన క్లియరెన్స్‌ కారణాలతో రాజకీయ నేపథ్యం ఉన్న మీడియా వన్‌ టీవీ ఛానల్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ఆ ఛానల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రసారాలు కొనసాగించేందుకు మార్చిలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు నిషేధానికి వ్యతిరేకంగా మీడియా వన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును గత వారం రిజర్వ్‌లో ఉంచింది.