సోషల్ మీడియా గ్రీవెన్స్ అపెలేట్ కమిటీ విధి విధానాలు త్వరలో 

సోషల్ మీడియా వినియోగదారుల అపరిష్కృత ఫిర్యాదులను పరిష్కరించడానికి ఏర్పాటు చేయబోయే గ్రీవెన్స్ అపెలేట్ కమిటీ విధి విధానాలను ప్రభుత్వం మరో 10-12 రోజుల్లో ఖరారు చేస్తుందని కేంద్ర ఐటి శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ఈ నెల 30 నాటికల్లా ఈ కమిటీ సిద్ధమవుతుందని తాముఆశిస్తున్నామని ఆయన తెలిపారు.

అంతేకాదు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఐటి నిబంధనలు, చట్టాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు తమకు ఇష్టమైన రీతిలో ఎంపిక చేసుకోవడం కోసం కాదని తెలిపారు. డిజిటల్ పౌరుల ఫిర్యాదులను గనుక సమర్థవంతంగా పరిష్కరించని పక్షంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, పౌరుల మధ్య జరిగే ఘర్షణలో ప్రభుత్వం మౌన ప్రేక్షకుడిలా చూస్తూ ఉండబోదని మంత్రి స్పష్టం చేశారు. 

వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి పరిశ్రమే ఒక పటిష్టమైన, స్వీయ నియంత్రిత వ్యవస్థతో ముందుకు వస్తే ప్రభుత్వం స్వాగతిస్తుందని ఆయన చెప్పారు. వాస్తవానికి పరిశ్రమ ఒక స్పష్టమైన ప్రతిపాదనతో ముందుకు రావడం కోసం నిబంధనలు సిద్ధమైన తర్వాత కూడా ప్రభుత్వం దాదాపు రెండున్నర నెలలు వేచి చూసిందని కూడా ఆయన చెప్పారు.

అపెలేట్ వ్యవస్థ పాత్ర పోషించాలని ప్రభుత్వం ఇప్పటికీ అనుకోవడం లేదు. పరిశ్రమ గనుక వినియోగదారుల సంఘాలతో కలిసి ఒక అర్థవంతమైన వ్యవస్థతో ముందుకు వస్తే దాన్ని పరిశీలించడానికి తాము ఇప్పటికీ సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారు. 

ప్రభుత్వం గత వారం నోటిఫై చేసిన కఠినమైన ఐటి నిబంధనలతో సోషల్ మీడియా వినియోగదారులు కంటెంట్, ఇతర విషయాలకు సంబంధించి తొలుత చేసే ఫిర్యాదులను అవి పరిష్కరించకుండా ఉన్న పక్షంలో వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం నియమించే గ్రీవెన్స్ అపెలేట్ కమిటీ(జిఎసి)లు పరిష్కరించడానికి వీలు కలిగింది.

‘ఈ కమిటీల స్వరూప స్వభావాలు, విధి విధానాలను మరో 10 12రోజుల్లో ప్రకటిస్తాం. అయితే వినియోగారులు, పరిశ్రమ ఇద్దరితో చర్చించకుండా దేన్ని కూడా ఖరారు చేయబోమని మీకు హామీ ఇస్తున్నాను’ అని రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు.