కాలేజీ ప్రిన్సిపాల్‌ని చంపుతానని బెదిరించిన ఎస్‌ఎఫ్‌ఐ నేత

కేరళలోని అధికార పార్టీకి చెందిన విద్యార్థి సంఘం నాయకుడు ఒకరు తన మద్దతు దారులతో ఓ ఇజినీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ గదిలోకి దూసుకు వెళ్ళిపోయి, చంపుతానని అంటూ ఆగ్రహంతో బెదిరించాడు. అక్కడున్న పోలీసులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు.

త్రిసూర్ లోని మహారాజ టెక్నలాజికల్ ఇన్స్టిట్యూట్ లో గత నెల 25న జరిగిన ఈ సంఘటనకు  సిసిటివి ఫ్యూటేజ్ వైరల్ గా మారడంతో సర్వత్రా ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. “నిన్ను ఇష్టం  వచ్చిన్నట్లు కొడతాం. కాల్చి పారవేస్తాం” అంటూ ఎస్ఎఫ్ఐ నేతలు ఆగ్రహంగా బెదిరించడం స్పష్టంగా కనిపిస్తున్నది.

ఆ సమయంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ తో సహా యిద్దరు పోలీసులు అక్కడే ఉన్నారు. చంపుతామని ప్రిన్సిపాల్ ను హెచ్చరిస్తున్నా పోలీసులు వారిని కట్టడి చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండడం కనిపిస్తుంది.

ఇన్ ఛార్జ్ ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్న డా. డి ఫిలిప్ ఫిర్యాదు చేయడంతో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హస్సన్ ముబారక్ తో పాటు మరో ఐదుగురిపై త్రిసూర్ ఈస్ట్ పోలీసులు బెయిల్ కు వీలు కల్పించే సెక్షన్ లపై  కేసు నమోదు చేశారు. చట్టవ్యతిరేకంగా గుమికూడటం, ఓ అధికారి విధులకు భంగం కలిగించడం వంటి నేరారోపణలు నమోదు చేశారు.

విద్యార్థుల నిరసనలో పాల్గొనడానికి అక్కడకు వచ్చిన ఎస్ఎఫ్ఐ నాయకులు అక్కడ మహిళా ఉపాధ్యాయుల సమక్షంలోనే ఐదు నిముషాల సేపు దుర్భాషలాడుతూ, బెదిరిస్తుండటం సిసిటివి ఫ్యూటేజ్ లో స్పష్టంగా కనిపిస్తున్నది. 

“మేము మీకు ఒక విషయం స్పష్టం చేస్తున్నాము. ఇక్కడి విద్యార్థులపై గూండాయిజం ప్రదర్శిస్తే మీ కాళ్లు విరగ్గొడతాను” అంటూ బెదిరించాడు. “నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. ఇప్పటివరకు మీరు విద్యార్థులకు వ్యతిరేకంగా చేస్తున్న పనిలా ఉండదు. ఇది రేపటి నుండి మీరు పూర్తిగా కొత్త గేమ్ చూస్తారు” అంటూ హెచ్చరించాడు.  

“మీరు క్యాంపస్ నుండి బయటికి వచ్చినప్పుడు నేను ఏమి చేయగలనో మీకు చూపిస్తాను. నీ కాళ్లు విరగ్గొడతాను. విద్యార్థులపై గూండాయిజం చూపవద్దు. విద్యార్థులతో తెలివిగా ప్రవర్తిస్తే మీ రెండు చేతులు విరగ్గొడతాను. నీకు అర్ధమైనదా?” అంటూ  దురుసుగా ప్రవర్తించాడు. 

“మేము సాధారణంగా ఉపాధ్యాయుల పట్ల గౌరవంగా ప్రవర్తిస్తాము. ఎన్నో కాలేజీలు, యూనివర్శిటీ సిండికేట్‌లలో ఎందరో టీచర్లను చూశాం. మీరు విద్యార్థులను మళ్లీ తాకడానికి ధైర్యం చేస్తే… మీరు వ్రాతపూర్వకంగా క్షమించమని వేడుకుంటారు.నీ కాళ్లు విరగ్గొడతాను. గూండాయిజం చూపించే ధైర్యం ఉందా? నిన్ను తగులబెడతాను…” అంటూ తీవ్రంగా దుర్భాషలాడాడు.

కాలేజీలో ఓ విద్యార్థి టోపీ పెట్టుకొని రావడంతో ఈ ఘర్షణ ప్రారంభమైనది.  ప్రిన్సిపాల్ డాక్టర్ దిలీప్ ఆ టోపీని తొలగించమని విద్యార్థిని కోరినప్పటికీ, విద్యార్థి నిరాకరించాడు. దానితో ఆయనే  బలవంతంగా టోపీని తొలగించారని ఎస్‌ఎఫ్‌ఐ ఆరోపించింది.

దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు సమ్మెకు దిగడంతో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ పోలీసులను పిలిపించి ఆందోళనకారులను బలవంతంగా తొలగించారు. హసన్, అతని మద్దతుదారుల  సమ్మెలో భాగంగా క్యాంపస్‌కు వచ్చి దౌర్జన్యానికి దిగారు. ప్రిన్సిపాల్ నే  చంపేస్తామని బెదిరింపులు జారీ చేయడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. 

అయితే వైద్య కారణాలతో, డాక్టర్ సలహాపై ఆ  విద్యార్థి టోపీ ధరించడంతో ప్రిన్సిపాల్ అతని పట్ల  దురుసుగా ప్రవర్తించారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపిస్తున్నారు.